మకర సంక్రాంతిని దేశమంతా అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే వివిధ రాష్ట్రాల్లో మకర సంక్రాంతిని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. కర్ణాటకలో ఈ పండుగను ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందాం. కర్ణాటకలో ఈ పండుగను ఏలు బిరోదు అంటారు. ఇక్కడ ఈ పండుగ నాడు పిండివంటలను ఒక పది కుటుంబాలతో మార్చుకుంటారు. చెరకు, నువ్వులు, బెల్లం, కొబ్బరితో తయారు చేసిన వస్తువులను మార్పిడి చేసుకుంటారు. ఇక రైతులు వారి ఎద్దులు, ఆవులను రంగు రంగు దుస్తులతో అలంకరిస్తారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడి రైతులు తమ ఎద్దులతో పాటు నిప్పులపై నడుస్తారు.
పంజాబ్‌లో మకర సంక్రాంతిని మాఘిగా జరుపుకుంటారు. ఇక్కడే సంక్రాంతి పండుగ నాడు జాతర నిర్వహిస్తారు. మాఘిలో శ్రీ ముక్త్సార్ సాహిబ్‌లో ఈ జాతర జరుగుతుంది. ఇక్కడ ప్రజలు డ్యాన్స్ చేస్తూ పాటలు పాడతారు. ఇక్కడ ఈ రోజున కిచడీ, బెల్లం, ఖీర్ తినే సంప్రదాయం ఉంది. గుజరాత్‌లో మకర సంక్రాంతిని ఉత్తరాయణంగా జరుపుకుంటారు. ఇక్కడ ఈ పండుగను రెండు రోజుల పాటు జరుపుకుంటారు. ఉత్తరాయణం నాడు గుజరాత్‌లో గాలిపటాల పండుగ జరుగుతుంది. అలాగే బెల్లంతో స్వీట్టు, సీజన్‌లో లభించే కూరగాలతో వంటకాలు చేసుకుంటారు. రాజస్థాన్‌లో సంక్రాంతి పండుగ సమయంలో స్త్రీలు ఒక ఆచారాన్ని అనుసరిస్తారు. ఆచారంలో భాగంగా 13 మంది వివాహిత స్త్రీలకు ఇల్లు, అలంకరణ లేదా ఆహారానికి సంబంధించిన వస్తువులను అందిస్తారు.