శివుడి చేతిలో ఢమరుకం తప్పనిసరిగా కనిపిస్తుంది. అసలు ఎందుకు శివుడు ఢమరుకాన్ని తన చేతిలో పట్టుకుని కనిపిస్తాడు? దీని కథా కమామీషు ఏంటో తెలుసుకుందాం. ఢమరుకం 14 రకాల ధ్వనులను విడుదల చేస్తుంది. అసలెందుకు శివుడు ఢమరుకం చేతబట్టుకుని ఉంటాడంటే.. లోక కల్యాణం కోసమని చెబుతారు. సృష్టి ఏర్పడిన మొదట్లో ఈ ప్రపంచం అంతా చాలా నిశ్శబ్దం అలుముకుని ఉండేదట. దీంతో శివుడికి ఏదో వెలితిగా అనిపించిందట. వెంటనే బ్రహ్మ, విష్ణువుల అనుమతితో కమండలం నుంచి నీటిని తీసుకుని మంత్రించి ఆ నీటిని నేలపై చల్లగా శక్తి స్వరూపిని అయిన శారదా దేవి ఉద్భవించిందట.
శారదా దేవి నాలుగు భుజములతో చతుర్భుజిగా ఉద్భవించింది. ఇక ఈ నాలుగు చేతులలో ఒక చేతిలో వీణ, మరొక చేతిలో పుస్తకం, మూడవ చేతిలో జపమాల, నాలువ చేతిలో వర ముద్రతో ఉంటుంది. శారదా దేవి తన చేతిలో ఉన్న వీణను మధురంగా వాయించడంతో.. శివుడు వీణకు అనుగుణంగా ఢమరుకాన్ని సృష్టించి వాయించాడట. ఈ విశ్వంలో లయను స్థాపించడానికే శివుడు ఢమరుకాన్ని సృష్టించాడని చెబుతారు. అందుకే ఢమరుకం నుంచి 14 రకాల ధ్వనులు వెలువడుతుంటాయి. దీని నుంచి వెలువడే శబ్దం మనల్ని మానసిక రుగ్మతల నుంచి దూరం చేస్తుందని నమ్మకం. ఇక ఇంట్లో మనం శివుడిని పూజించేటప్పుడు ఢమరుకాన్ని వాయిస్తే ఆయన సంతోషిస్తాడట. తద్వారా నెగిటివ్ ఎనర్జీ పోవడంతో పాటు ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం పెంపొందుతుందట.