హిందూ దేవాలయాలన్నీ కూడా దాదాపు ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కొన్ని ఆలయాల్లో వింతలూ.. విశేషాలకు కొదువ ఉండదు. కొన్ని ఆలయాలకు వెళితే అక్కడి పరిస్థితులు మనల్ని షాక్‌కు గురి చేస్తాయి. అలాంటి ఆలయాల్లో కేవడ స్వామి ఆలయం ఒకటి. ఇక్కడ మనల్ని షాక్‌కు గురి చేసే సంప్రదాయం ఏంటంటే.. ఇక్కడి స్వామివారిని గొలుసులతో కట్టి ఉంచడం. ఇలా ప్రజలు దేవుడిని ఎందుకు గొలుసులతో కట్టి ఉంచారనే దానికి ఓ ఆసక్తికర కథ ఉంది. ఆ కథ కూడా మనల్ని షాక్‌కు గురి చేస్తుంది. ఇక ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో ఉంది. ఇది కాల భైరవుడి ఆలయం. ఇక్కడ భైరవుడు 600 సంవత్సరాలుగా కేవడ స్వామి రూపంలో పూజలందుకుంటున్నాడు.
ఇక స్వామివారిని ఎందుకు గొలుసులతో కట్టి ఉంచుతారనే కదా మీ సందేహం. ఇక్కడి కాల భైరవుడు ఓ పిల్లాడి రూపంలో ఉంటాడని భక్తుల నమ్మకం. ఈ క్రమంలోనే అప్పట్లో నగరంలోకి స్వామివారు పిల్లలతో ఆడుకునేందుకు వెళ్లేవాడట. ప్రతిరోజూ కూడా బాలుడి రూపంలో పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాడట. అయితే ఆడుకునే సమయంలో చిన్నారుల మధ్య ఏమైనా గొడవ జరిగితే.. ఆ సమయంలో కాల భైరవుడికి కోపం వస్తే తోటి పిల్లలను ఎత్తి అక్కడున్న చెరువులో పడేసేవాడట. విషయం తెలుసుకున్న గ్రామస్తులు భైరవుడి ముందు ఒక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలతో ఆడుకోవడానికి స్వామివారు బయటకు వెళ్లకుండా.. అసలు ఆలయం నుంచి కదలకుండా చేయడం కోసం ఆయనను గొలుసులతో బంధించారు. ఇదీ కథ.