
హిందూమతంలో కొన్ని రోజులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ముఖ్యమైన రోజుల్లో ఒకటి శని త్రయోదశి. శనివారం నాడు త్రయోదశి వచ్చిందంటే అదే శని త్రయోదశి. ఈ రోజున శివకేశవులతో పాటు శనీశ్వరుడిని పూజిస్తాం. ముఖ్యంగా ఈ రోజున శనీశ్వరుడిని పూజిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయట. శనివారం శనిశ్వరుడికి ఇష్టమైన రోజు. అలాగే త్రయోదశి తిథి శివుడికి ఇష్టమైన తిథి. కాబట్టి శని త్రయోదశి నాడు శనీశ్వరుడితో పాటు శివుడిని కూడా పూజిస్తాం. ఎవరైతే ఈ త్రయోదశి నాడు ఉపవాసం ఉంటారో వారి కోరికలన్నీ నెరవేరడంతో పాటు జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం.
శని త్రయోదశి రోజున శివపార్వతులతో పాటు శనిశ్వరుడిని కూడా పూజిస్తారు. అసలు శని త్రయోదశి ఎప్పుడు రానుందో తెలుసుకుందాం. వేద పంచాంగం ప్రకారం శని త్రయోదశి డిసెంబర్ 28వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:28 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో శని త్రయోదశి డిసెంబర్ 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3.32 గంటలకు ముగుస్తుంది. అంటే త్రయోదశి తిథి శనివారం ప్రారంభమవుతుంది కాబట్టి పూజను డిసెంబర్ 28వ తేదీనే చేయాల్సి ఉంటుంది. ఈ రోజున శని ప్రదోష వ్రతం కూడా చేస్తారు.
