హిందువులు మోహినీ ఏకాదశిని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఆచరిస్తూ ఉంటారు. మరి మోహినీ ఏకాదశి ఎప్పుడు వస్తుందంటారా? పంచాంగం ప్రకారమైతే మే 18న అంటే ఈ శనివారమే రానుంది. శనివారం ఉదయం 11.22 గంటలకు ప్రారంభమై.. మే 19న మధ్యాహ్నం 1.50 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి కారణంగా మే 19న మోహినీ ఏకాదశి ఉపవాసం ఉంటారు. అసలు మోహినీ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి? అంటే.. క్షీర సాగర మథనం సమయంలో ఒక్కొక్కటిగా ఉద్భవిస్తూ చివరకు అమృతం లభించిందన్న విషయం తెలిసిందే.
అమృతం లభించిన సమయంలో దేవతలు, రాక్షసుల మధ్య పంపకాల గొడవ తలెత్తింది. దేవతల స్థానాలను రాక్షసులు ఆక్రమించడం ప్రారంభించారు. అప్పుడు దేవతలంతా విష్ణు మూర్తిని ప్రార్థించారు. తమను రక్షించమని వేడుకుంటున్న దేవతల కోసం విష్ణుమూర్తి మోహినీ అవతారం ఎత్తాడు. అందరినీ లైనుగా కూర్చోబెట్టి దేవతల నుంచి అమృతాన్ని అందిస్తూ వచ్చాడు. దీంతో దేవతలందరూ అమరత్వాన్ని పొందారు. ఇదంతా జరిగింది ఏకాదశి రోజునే అని చెబుతారు కాబట్టి ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజున ఉపవాసముండి వ్రతమాచరించడం వలన చేసిన పాపాలన్నీ నశిస్తాయట. వైకుంఠం ప్రాప్తిస్తుందని నమ్మకం.