
సుబ్రహ్మణ్యస్వామి వారు రాసిభూతమైన జ్ఞానస్వరూపం. సునిసితమైన మేధస్సుకు స్వామి వారి చేతిలో ఉండే శక్తి ఆయుధమే ప్రతీక. శివజ్ఞానప్రదాయిని అయిన అమ్మవారు ప్రసాదించిన దివ్యాయుధమిది. ఇదే అజ్ఞానమనే తారకాసురుని సంహరించిన జ్ఞానశక్త్యాయుధము. “జ్ఞానశక్త్యాత్మా” అనేది స్వామి వారి నామాలలో ఒకటి. ఇఛ్చా , జ్ఞాన , క్రియా అనేమూడు శక్తుల మయమైన శక్తిని ధరించిన జ్ఞానశక్తి స్వరూపుడు , జ్ఞానయోగంలో సాక్షాత్కరించే శివశక్త్యాత్మక తేజః పుంజం – కుమారస్వామి. ఆరు కోణాల చక్రం – బహుముఖీయమైన ప్రజ్ఞకు సంకేతం కనుక కవిత్వానికీ , ప్రతిభకీ , ఆధారశక్తిగా కూడా కుమారస్వామి ఉపాసన చెప్పబడినది. “షణ్ముఖీ ప్రతిభ” ప్రసాదించే ఈ కార్తికేయుని ‘కవి’గా పేర్కొన్నాయి శాస్త్రాలు.
“పుట్టన్ బుట్ట శరంబునన్ మొలువ” అనే పద్యంలో పోతన గారు…” కావ్య రచనా సామర్ధ్యానికి నేను వాల్మీకిని కాను (పుట్టన్ బుట్ట) , శరవణభవుణ్ణి కాను (శరంబునన్ మొలువ)” అంటూ ప్రార్ధించారు. ఈ మాటలో కూడా కవితా శక్తి నిధిగా స్కందుడోచరిస్తున్నాడు. శివతేజం స్కన్నమై వచ్చి రూపుకట్టిన దైవం కనుక ఈయన స్కందుడు. రామాయణంలో యాగరక్షణకు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో వెళుతుండగా , మార్గమధ్యంలో స్కందోత్పత్తి (సుబ్రహ్మణ్య జనన ఆఖ్యానము) వివరిస్తారు మహర్షి. కార్తికేయ భక్తులు ఇహలోకంలో ఆయుష్మంతులై పుత్రపౌత్రులతో వర్ధిల్లి అంత్యమున స్కంద సాలోక్యాన్ని పొందుతారు. ఓ రామా ! ఈ కుమారసంభవం “ధన్యపుణ్యగాథ” అని విశ్వామిత్రుని మాట (వాల్మీకి రామాయణం – బాలకాండ).
