శ్రావణమాసం ప్రారంభం కావడంతో అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ, విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానాలు, వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారు, హైదరాబాద్‌లోని పెద్దమ్మతల్లి తదితర అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలను భక్తులు నిర్వహిస్తున్నారు. ఈ మాసం మొత్తం మంగళగౌరీ పూజ, వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. శ్రావణ మాసంలో రెండో వారం.. అంటే ఈ నెల16వ తేదీన(శుక్రవారం) వరలక్ష్మీ వ్రతం మహిళలంతా చేసుకోనున్నారు.
ప్రతి శుక్రవారం అమ్మవారికి శ్రీ సూక్తం విధానంలో పూజలు చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే శ్రీ సూక్తం అక్షరం అటు ఇటు అయినా కూడా అర్థమే మారిపోతుంది కాబట్టి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా శ్రీ సూక్తం పఠించాలి.
చంద్రాం ప్ర‘భాసాం యశసా జ్వలం’తీం శ్రియం లోకే దేవజు’ష్టాముదారామ్
తాం పద్మినీ‘మీం శరణమహం ప్రప’ద్యే உ(అ) లక్ష్మీర్మే’ నశ్యతాం త్వాం వృ’ణే
పై శ్లోకాన్ని తప్పులు లేకుండా చక్కగా పఠించాలి. శక్తి ప్రణవాన్ని స్పష్టంగా ఉచ్ఛరించాలి. లేదంటే అర్థమే మారిపోతుంది. తాం పద్మినీ‘మీం శర’ణమహం ప్రప’ద్యే పక్కనే ‘உ’ గుర్తు ఉంది గమనించారా.. సంస్కృతంలో ఈ గుర్తుకు ‘అ’ అని అర్థం. అసలు దీనికి అర్థం ఏంటంటే.. దరిద్ర దేవతను నశింపజేయమని అమ్మవారిని శరణు వేడుకోవడం. ఆ సింబల్‌ను గుర్తించకుండా ‘లక్ష్మీర్మే’ నశ్యతాం అని చదివితే నా సంపదలు నాశనం చేయమ్మా అని అర్థం వస్తుంది. దీంతో మనం ఇబ్బందుల్లో పడిపోతాం. కాబట్టి శ్రీ సూక్తం చదివేటప్పుడు తప్పులకు స్థానం ఇవ్వకూడదు.