శ్రీ మహాలక్ష్మిని నారదుల వారు ఎందుకు శపించాల్సి వచ్చిందనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ తరువాత ఏం జరిగిందనేది తెలుసుకుందాం. లక్ష్మీదేవిని నారదుల వారు శపించిన విషయం తెలియగానే లక్ష్మీనారాయణులు ఆయన ముందు ప్రత్యక్షమై మన్నించమని వేడుకున్నారు. సాక్షాత్తు లక్ష్మీనారాయణులే వేడుకోవడంతో నారదుడు శాంతించాడు. తన తొందరపాటుకు పశ్చాత్తాపం చెందడంతో పాటు.. ఆయనకు ఒక్కసారిగా శరీరమంతా చెమటలు పట్టాయి. అప్పుడు నారాయణుడు నారదుడిని చూసి హిత బోధ మొదలు పెట్టాడు.
‘‘నారదా నీ కోపం నాకు అర్తమైంది. నిజానికి తుంబురుడు భక్తి జ్ఞానములందు, శీల వర్తనములందు నీకన్నా కపటి, గర్విష్టుడు ఏమాత్రం కాదు. కపట భక్తిని ప్రదర్శించువారు ఎన్ని తీర్థాలు సేవించినా వ్యర్థం. భక్తి శ్రద్ధలతో తనను ఎవరు కొలిచినా వశ్యుడినవుతాను. సంగీతంతో నన్ను చేరవచ్చునని చెప్పేందుకే కౌశిక తుంబురులను సత్కరించాను. నీ శాపానికి బాధ పడటం లేదు. ఎందుకంటే నీ శాపంతో లోకహితమే జరుగుతుంది కాబట్టి బాధపడవద్దు’’ అని తెలిపాడు. అప్పటికి కానీ నారదుడికి జ్ఞానోదయమవలేదు. తన తపపులను క్షమించమని.. తనను కాపాడమని నారాయణుడిని వేడుకున్నాడు. తాను కూడా తుంబురుడు, కౌశికకుని మాదిరిగా సంగీతంలో మేటి అయ్యుంటే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదని ఆవేదన చెందాడు. అప్పుడు నారాయణుడు ఉలూకపతికి సేవ చేసి సంగీతంలో మేటి కావాలని తెలిపాడు.