
మకర సంక్రాంతి పండుగ ఎప్పుడనేది తెలుసుకున్నాం కదా.. ఈ రోజున పూజా విధానం ఏంటో కూడా తెలుసుకుందాం. పండుగల సమయంలో మనం ఉదయాన్ని బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తాం. కాబట్టి మకర సంక్రాంతి నాడు కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేని నీటిలో ఉంటే గంగా జలం లేదంటే తులసి దళాలను వేసి శుచిగా స్నానమాచరించాలి. ఆ తరువాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. దీనికోసం రాగి పాత్రలో నీటిని నింపి.. అందులో కుంకుమ, అక్షతలు, నువ్వులు, ఎర్ర పువ్వులు కలపాలి. ఈ రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మనకు ఏవైనా అనారోగ్య సమస్యలున్నా మొత్తం తొలగిపోతాయట.
అర్ఘ్యం అర్పించిన అనంతరం పూజ చేసే సమయంలో ఎరుపు పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం (నువ్వులు లడ్డులు, బెల్లం) మొదలైన వాటిని ఉపయోగించాలి. మకర సంక్రాంతి రోజున దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హిందువుల నమ్మకం ప్రకారం ఈ రోజున సూర్య భగవానుని పూజించడం వల్ల వ్యాధుల నుంచి ఉపశమనం లభించి ఆరోగ్యంగా ఉంటారు. సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత రోజులో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి శీతాకాలం తగ్గుముఖం పట్టడం మొదలవుతుందని చెబుతారు. ఈ రోజున వచ్చిన కొత్త పంటతో పరమాన్నం చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. అలాగే ఈ రోజు నుంచి ఉత్తరాయణం కాలం మొదలవుతుంది. ఇది సానుకూల శక్తి, ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.
