ఆషాఢంలో బోనాలే కాదు.. శాకంబరీ దేవి ఉత్సవాలు సైతం జరుగుతూనే ఉంటాయి. ఇంతకీ శాకంబరీ దేవి కథేంటి అంటారా? ప్రజలకు కష్టం వస్తే అమ్మవారు చూస్తూ కూర్చోదు.. ఏదో ఒక రూపంలో తన చేయి అందించి ఆ కష్టం నుంచి బయటకు లాగుతుంది. ఒకసారి లోకంలో పాపాలు పెరిగిపోయి వర్షాలు పడలేదట. దీంతో విపరీతమైన కరువు వచ్చిందట. వర్షాలు లేకపోవడంతో పంటలు లేవు సరికదా గడ్డి గింజ కూడా మొలిచే పరిస్థితి లేదట. ప్రాణులన్నీ ఆకలి దప్పులకు అల్లాడిపోతున్నాయట. ఆ తరుణంలో అమ్మవారు బిడ్డల కష్టాన్ని చూడలేక శాకంబరీ దేవిగా అవతారం ఎత్తిందట.
ప్రాణులన్నింటికీ కావల్సిన ధాన్యాలు, కూరగాయలు సమస్తం తానే సృష్టించిందట. అందుకే ఆ తల్లికి కృతజ్ఞతగా శాకంబరీ అవతారంలో ఆషాఢ మాసములో పూజించుకుంటూ ఉంటాం. అమ్మవారితో సహా ఆలయమంతా పండ్లు, పూలు, కూరగాయలతో అలంకరిస్తారు. ఆ తరువాత వాటిన్నంటినీ ప్రసాదముగా భక్తులకు అందచేస్తూ ఉంటారు. అమ్మవారు ఇచ్చిన దానిని తిరిగి అమ్మవారికే సమర్పించడం దీని ఉద్దేశమట. అమ్మవారికి అలా సమర్పిస్తే తమ ఆహారానికి లోటుండదని భావిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఏటా ఆషాఢమాసంలో శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.