దేవుని ప్రసాదం స్వీకరిస్తే పుణ్యం లభిస్తుందని నమ్మకం. అలాగే ఆలయంలోని ప్రసాదానికి ఉండే రుచి మనం ఇంట్లో చేసుకున్నా ఉండదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో ప్రసాదం అనగానే పులిహార, దద్దోజనం.. చెక్కెర పొంగలి లేదంటే లడ్డూలు మాత్రమే ఉంటాయి. కానీ అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులకు అందించే ప్రసాదం మాత్రం ఇతర ఆలయాలకు భిన్నంగా ఉంటుంది. అన్నవరం ప్రసాదం కూడా ప్రత్యేకత కారణంగా మహాప్రసాదాల జాబితాలో చేరింది. స్వామి వారికి గోధుమలతో తయారుచేసిన హల్వ వంటి ప్రత్యేకమైన పదార్ధాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
అన్నవరం ప్రసాదానికి సంబంధించి ఆసక్తికర కథలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటేంటంటే.. కొన్ని జాతీయ రోడ్డు-రైలు మార్గాలు అన్నవరం మీదుగా వెళుతుంటాయి. ఉత్తరాదివారు గోధుమలతో చేసిన ఆహారాన్ని స్వీకరిస్తారు. అలా అటుగా వెళ్లే ఉత్తరాదివారు.. అలాగే ఆ ప్రాంతంలో పని చేసే ఉత్తరాది కూలీలు స్వామివారికి గోధుమలతో తయారు చేసిన వంటకాన్ని నైవేద్యంగా సమర్పించేవారట. అలా గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించడం ప్రారంభమైందని చెబుతారు. అలాగే అరటిపండు, నెయ్యి, పాలు, గోధుమ సత్యనారాయణ స్వామికి ప్రీతిపాత్రమైనవని కాబట్టి వాటితో తయారు చేసిన ఆహార పదార్థాన్ని ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా మారిందట.