శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత అర్జనుడు ఏమయ్యాడు? నిజానికి ఇది ఎప్పుడూ మనం ఆలోచించని ప్రశ్న. అసలు శ్రీకృష్ణ భగవానుడు మరణించాడన్న విషయమే మన తలపునకు రాదు. శ్రీకృష్ణుడి నేతృత్వంలో పాండవులు వీరోచితంగా పోరాడి కౌరవ సేనను మట్టి కరిపించారు. కౌరవులందరినీ హతమార్చారు. దీంతో కౌరవుల తల్లిదండ్రులైన గాంధారి, ధృతరాష్ణులు కుంగిపోతారు. యుద్ధానంతరం శ్రీకృష్ణుడు హస్తినాపూర్‌కు తిరిగి రాగా.. ఆయనను చూసిన గాంధారి అగ్ని పర్వతంలా మారిపోతుంది. వంద మంది కుమారులు మరణిస్తుంటే శ్రీకృష్ణుడు చోద్యం చూశాడని నిందించడమే కాకుండా ఆయనను శపిస్తుంది.
ఆ తరువాత గాంధారి శాపం కారణంగా శ్రీకృష్ణుడు మరణిస్తాడు. యాదవ వంశం మొత్తం నశిస్తుంది. అనంతరం ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుంది. శ్రీకృష్ణుడు మరణించిన తరువాత.. అర్జునుడి జీవితంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ద్వారక నగరం నీటిలో మునిగిపోవడంతో శ్రీకృష్ణుడి 16,100 మంది భార్యలతో పాటు ద్వారకలోని పౌరులందరినీ ఇంద్రప్రస్థానికి తీసుకుని వెళతాడు. నిజానికి అర్జనుడికి ఆది నుంచి కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు అత్యంత శక్తివంతమైన శక్తిగి ఉన్నాడు. అలాంటి శ్రీకృష్ణుడు మరణించడంతో అర్జనుడు తన శక్తినంతా కోల్పోయి ఒక సాధారణ పౌరుడిగా మిగిలిపోయాడు.