
శ్రీరామనవమి నాడు తప్పని సరిగా ప్రసాదంగా పానకం, వడపప్పు ప్రతి దేవాలయంలోనూ అందజేస్తారు. ఇళ్లలో సైతం శ్రీరామనవమికి తప్పక ప్రసాదంగా ఈ రెండింటినీ స్వీకరిస్తారు. అసలు పానకం, వడపప్పు వెనుకున్న పరమార్థం ఏంటి? నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం.
మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు – పానకం కూడా అంతే. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు… పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం.
