శివార్చనకు బిల్వదళం శ్రేష్ఠం. బిల్వదళం లక్ష్మీస్వరూపం కనుక శివునితో పాటు పలువురు దేవీదేవతలకు బిల్వదళం ఇష్టమే. తులసిని విరివిగా వినియోగిస్తారు. వరసిద్ధి వినాయకుడికి ఏకవింశతి అంటే ఇరవై ఒక్క పత్రాలతో అర్చన చేస్తారు. హనుమంతునికి మాత్రం తమలపాకులతో ప్రత్యేకమైన పూజచేస్తారు. దానికి సంబంధించి సుందరకాండ చివరిలో ఒక గాథ ఉంది. సీతాన్వేషణ కోసం లంకకు వెళ్లిన హనుమ విజయుడై తిరిగి వచ్చాడు. తొలిగా ఆ వార్తను తోటి వాసరులకు తెలియచేశాడు. అప్పుడు వారు ఆనందం పంచుకోవడం కోసం లతలను తీసుకువచ్చి ఆయన మెళ్లో అలంకరించారు. పత్రపుష్పాలను ఆయన పాదాలపై సమర్పించారు. ఆ పత్రాలు, లతలన్నీ నాగవల్లీ లతలే. అంటే తమలపాకులు.
మరో విశేషం ఏమిటంటే హనుమంతుడు మంగళవారానికి అధిపతి. మంగళుడంటే కుజుడు. సాధారణంగా కుజుణ్ణి సర్పరూపంలో ఆరాధిస్తాం. కుజగ్రహ అధిదైవతమైన హనుమంతుణ్ణి నాగవల్లీ అని పిలిచే తమలపాకులతో పూజించడం వల్ల కుజదోషాలు పరిహారమవుతాయి. అష్టోత్తర శతనామాలతో, సహస్రనామాలతో, లక్ష తమలపాకులతో హనుమకు అర్చన చేస్తారు. హనుమంతుని పూజలో కనీసం అయిదు తమలపాకులైనా ఉండాలని నియమం. జీవితంలో ప్రశాంతతను, సౌభాగ్యసిద్ధిని పొందడానికి హనుమకు ఆకుపూజ చేయడం సర్వశ్రేష్ఠం.