ఈ నెల 30న మాస శివరాత్రిని జరుపుకోనున్నామని తెలుసుకున్నాం కదా. ఈ రోజున పవిత్రమైన యాదృచ్చికం ఏర్పడనుంది. ఇవాళ పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పొందేందుకు సువర్ణావకాశంగా శివరాత్రిని భావిస్తాం. కాబట్టి ఈ సమయంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేస్తే మన కోరికలన్నీ నెరవేరి సుఖశాంతులు వెల్లివిరుస్తాయట. మరి పూజా విధానం ఏంటో తెలుసుకుందాం. మాస శివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తాన నిద్రలేచి శుచిగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి.
ఇంట్లో పూజ గదిలో లేదంటే శుభ్రమైన ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్టించి.. గంగాజలం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి మొదలైన వాటితో శివలింగానికి అభిషేకం చేయాలి. శివలింగంపై శివయ్యకు ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించాలి. అనంతరం ధూపం, దీపాలను వెలిగించాలి. పూజ చేస్తున్నంత సేపు ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ శివయ్యకు హారతి ఇవ్వాలి. అనంతరం పండ్లు, పుష్పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇక పూజా సమయంలో తప్పకుండా మాస శివరాత్రి కథను వినాల్సి ఉంటుంది. ‘‘ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నో రుద్ర ప్రచోదయాత్ ఓం త్రయంబకం యజామహే సుగన్ధి పుష్టివర్ధనమ్ ఉర్వారుకమివ్ బన్ధనన్ మృత్యోర్ముక్షీయ మమృతాత్’’ మంత్రాలను మాస శివరాత్రి రోజున జపిస్తే మంచి జరుగుతుందని నమ్మకం.