అసలు దక్షుడికి, చంద్రుడికి గొడవేంటి?

అసలు చంద్రుడు రాత్రి వేళల్లో మాత్రమే ఎందుకు కనిపిస్తాడు? చంద్రుడు , దక్షుడికి గొడవేంటి? చంద్రుడిని దక్షుడు ఎందుకు శపించాల్సి వచ్చింది? అనే అనుమానాలు మనకు కలుగవచ్చు. దీనికి కారణం లేకపోలేదు. బ్రహ్మ కుమారుడైన దక్షుడికి 27 మంది కుమార్తెలు. ఆ కుమార్తెలందరినీ చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే వివాహానికి ముందు తన కుమర్తెలందరికీ సమానంగా ప్రేమను పంచాలంటూ మాట తీసుకున్నాడు దక్షుడు. దీనికి చంద్రుడు కూడా సరేనన్నాడు. కానీ రాను రాను చంద్రుడికి 27 మందిలో రోహిణి అనే భార్యపై వ్యామోహం పెరగసాగింది. అయినా సరే చంద్రుడు పట్టించుకోలేదు.

దక్షుని మిగిలిన కుమార్తెలంతా అసూయతో రగిలిపోయి విషయాన్ని తండ్రికి చేరవేశారు. మొదట దక్షుడు చంద్రుడికి తన కుమార్తెలందరినీ ఒకేలా చూసుకోవాలని.. లేదంటే అనూహ్య పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. అయినా చంద్రుడిలో మార్పు రాలేదు. దీంతో ఏ వెలుగును చూసుకుని విర్రవీగుతున్నావో ఆ వెలుగు క్రమేపీ క్షీణించుగాక అని దక్షుడు శాపమిచ్చాడు. శాప విమోచనం కోసం చంద్రుడు చాలా మంది దేవుళ్లను ఆశ్రయించాడు. అయినా ఫలితం దక్కలేదు. చివరకు శివుడిని చంద్రుడు ఆశ్రయించగా.. కొంతమేర శాప విమోచనం కలిగించాడు. దీంతో ఉదయమంతా చంద్రుడు కనుమరుగై రాత్రి వేళ దర్శనమిస్తుంటాడు. అప్పటి నుంచి శివుడు సోమనాధుడిగానూ.. చంద్రశేఖరుడిగానూ పిలవబడుతున్నాడు.

Share this post with your friends