
అత్యంత ప్రాచీన కాలం నుంచే కాలగణనంలో అద్భుతమైన శాస్త్రీయమైన విజ్ఞానం కల దేశం మనది. ఖగోళ విజ్ఞాన ఆధారంగా ఇక్కడి కాలగణన ఉంది. దేశంలో భిన్న భిన్న ప్రాంతాలకు లభించే జ్యోతిర్మండల ప్రభావం కూడా భిన్న విభిన్నంగానే ఉంటుంది. అందుకే ఇక్కడ భిన్నమైన ‘కాలమానాలు’ ఉన్నాయి. కొందరిది సౌరమానమైతే, కొందరిది చాంద్రమానం. ఇంకొందరిది బార్హస్పత్యమానం. ఈ మానాలు ఎలా ఉన్నా, వీటన్నిటికి మూల విజ్ఞానం ప్రాచీనమైన జ్యోతిర్ జ్ఞానమే. గ్రహ నక్షత్ర విజ్ఞానంలో దేశమంతా ఒక్కటే.
‘బ్రాహ్మణ’ శబ్దం కుల వాచకం కాదు. ‘బ్రహ్మ’ శబ్దానికి ‘జ్ఞానం, బుద్ధి’ అని అర్థం. ‘బ్రాహ్మణులు’ అంటే సమాజంలో మేధావులు. వారు ఎవరైనా కావచ్చు. సత్త్వ గుణసంపన్నులైన మేధావులే ‘బ్రాహ్మణులు’ అనేది అచ్చమైన వైదిక నిర్వచనం, వీరు ఏ దేశపు సమాజంలోనైనా ఉంటారు. చంద్రమానాన్ని అనుసరించి ఒకసారి, సౌరమానం ప్రకారం ఇంకొన్నాళ్ళకి నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నా పంచాంగ సూత్రం మాత్రం రెండిటికీ ఒక్కటే. ఏ తిథి, ఏ వారము చెడ్డవి కావు. ఏది ఎందుకు అనుకూలమో అనేది తెలుసుకోవాలి. అదే పంచాంగ జ్ఞానం.
నేలంతా ఒకటే అయినా కొన్ని నేలలు పంటలకి అనుకూలం. కొన్ని కావు. కొన్ని… కొన్ని పంటలకే అనుకూలం. అలాగని నేలని పనికిరానిదని అనం కదా. అదేవిధంగా ‘జలం’ అని సామాన్యంగా వాడినా సముద్రజలం, నదీజలం, తాగేజలం, సాగు నీరు, పశువుల్ని కడిగేనీరు, మనల్ని కడుక్కొనే నీళ్ళు… ఇన్ని తేడాలున్నట్లే సూక్ష్మమైన కాలంలోనూ అనేక శక్తి భేదాలున్నాయి. వాటిని తెలియజేసే విజ్ఞానం పంచాంగాలలో దాగి ఉంది.
