హిందూ క్యాలెండర్ ప్రకారం 2024 సంవత్సరంలో చైత్ర మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తేదీ ఆదివారం మే 26న ఏకదంతం సంకష్ట చతుర్థిని జరుపుకోనున్నాం. ఈ రోజున వినాయకుడిని పూజిస్తే మంచి జరుగుతుందని చెబుతారు. మరి ఆ రోజున వినాయకుడిని ఎలా పూజించాలి? పూజా విధానం ఏంటి? వంటి విషయాలను చూద్దాం. ఏకదంతం సంకష్ట చతుర్థి రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అనంతరం పూజగదిలోని ఈశాన్య మూలలో పీఠాన్ని పెట్టి దానిపై ఎరుపు-పసుపు వస్త్రాన్ని పరచి వినాయకుడిని ప్రతిష్టించండి.
పూజ చేసి అనంతరం ఉపవాస దీక్ష చేపట్టి.. వినాయకుడికి నీళ్లు, పువ్వులు సమర్పించాలి. అనంతరం వినాయకుడికి పువ్వులు, దండలు, 11 లేదా 21 ముడులతో ఉన్న తోరణాన్ని సమర్పించి.. పసుపు, కుంకుమ అక్షితలను సమర్పించాలి. అనంతరం స్వామివారికి నైవేద్యంగా మోదకం, పండ్లను సమర్పించాలి. నీరు సమర్పించిన తర్వాత నెయ్యి దీపం, ధూపం వెలిగించాలి. ఇక పూజలో భాగంగా రోజంతా ఉపవాసముండి సూర్యాస్తమయానికి ముందే భగవంతుడిని పూజించాలి. అనంతరం వినాయకుడికి హారతిచ్చి గణేష్ చాలీసా పఠించి.. చంద్రుడిని దర్శించుకుని అర్ఘ్యం సమర్పించి ఉపవాసాన్ని విరమించాలి. ఇలా చేస్తే జీవితంలోని ఆటంకాలన్నీ తొలగిపోయి సుఖ శాంతులు నెలకొంటాయని పండితులు చెబుతారు.