సృష్టిలో అన్నింటి కన్నా తల్లి ప్రేమ గొప్పదని అంటారు. అలాగే కన్న ప్రేమకన్నా పెంచిన ప్రేమ గొప్పదని అంటారు. దీనిని నిరూపించిన తల్లి యశోదమ్మ. శ్రీకృష్ణుడిని అపురూపంగా పెంచింది. వెన్నముద్దలు తినిపిస్తూ కన్నయ్యే తన ప్రపంచంగా జీవించింది. అయితే యశోదకు కన్నయ్య తన కుమారుడు కాదన్న విషయం తెలియదట. అయినా సరే.. తల్లులందరికీ ఆమె ఒక ఆదర్శమూర్తి. నేడు (మే 10, ఆదివారం) మాతృదినోత్సవం సందర్బంగా శ్రీకృష్ణుడికి మాతృప్రేమను అందించిన యశోదమ్మ గురించి తెలుసుకుందాం. పూర్వ జన్మలో యశోద.. ద్రోణుడు అనే వసువు భార్యయైన ధార. ధార, ద్రోణుడు బ్రహ్మ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠిన తపస్సు చేసిందట.

అప్పుడు యశోదకు శ్రీమన్నారాయణుడిని తమ కుమారుడిగా పొందే వరం లభించిందట. దీంతో ఆమె కోరిక ద్వాపరయుగంలో లభించింది. ద్వాపరయుగంలో నందుడు, యశోదగా జన్మించారు. దేవకి గర్భాన జన్మించిన శ్రీకృష్ణ పరమాత్ముడు నందుడి ఇంటికి చేరాడు. యశోదానందుల కుమారుడిగా పెరిగాడు. అయితే నందుడికి కన్నయ్య తన కుమారుడు కాదని తెలుసు కానీ యశోదమ్మకు తెలియదని పురాణాలు చెబుతున్నాయి. చెరసాలలో జన్మించిన కన్నయ్యను కంసుని బారి నుంచి రక్షించేందుకు వసుదేవుడే స్వయంగా గోకులం చేర్చాడు. అప్పటికే యశోదకు ఆడబిడ్డ జన్మించగా.. ఆ బిడ్డను తీసుకుని తిరిగి చెరసాలకు తీసుకొచ్చాడు. అప్పుడే ప్రసవించి ఉండటంతో యశోదమ్మకు స్పృహ లేదని చెబుతారు. అలా కన్నయ్య.. యశోదమ్మ చెంత చేరాడు.
