జీవితంలో ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలనేది ప్రతి హిందువూ భావిస్తూ ఉంటారు. కాశీ ఎన్నో దేవాలయాలకు నెలవు. అసలు కాశీ నగరమే మహాదేవుని త్రిశూలంపై నిలుస్తుందని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ ఘాట్‌లు కూడా ప్రత్యేకమే.మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ ఈ ఘాట్‌ల విశేషాలు తెలుసుకుందాం. మనకు కాశీలో ఎక్కువగా వినిపించే ఘాట్ పేరు హరిశ్చంద్ర ఘాట్. కడదాకా ధర్మాన్నే నమ్ముకున్న రాజు సత్య హరిశ్చంద్రుడి పేరు మీదుగా ఈ ఘాట్‌కు హరిశ్చంద్ర ఘాట్ అని నామకరణం చేశారు. ఇక్కడ నిత్యం దహన సంస్కార కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.
మరో ప్రఖ్యాతిగాంచిన ఘాట్.. మణికర్ణిక ఘాట్. దీనిని ముక్తికి ద్వారంగా పేర్కొంటారు. ఇక్కడ కూడా మరణించిన వ్యక్తులకు దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇక్కడ కానీ మరణించిన వ్యక్తులకు దహన సంస్కారాలు జరిగితే వారికి మరు జన్మ ఉండదని నమ్ముతారు. అంతే కాకుండా వీరు జన్మజన్మల కర్మల నుంచి విముక్తి పొందుతారట. ఇక్కడే పార్వతీదేవి చెవిపోగు పడిందని పురాణాలు చెప్తున్నాయి. జనన మరణ కాల చక్రాన్ని ప్రతిబింబించేలా నిరంతరం ఇక్కడ చితి మంటలు మండుతూనే ఉంటాయి. ఈ రెండు ఘాట్‌లలోనే దహన సంస్కారాలు జరుగుతాయి.