స్మరణం, దాస్య భక్తి, సఖ్య భక్తి అంటే ఏంటంటే..

నారదుడు చెప్పిన తొమ్మిది భక్తి సూత్రాలలో శ్రవణం, కీర్తనం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన వాటి గురించి తెలుసుకుందాం. స్మరణం -అంటే తలుచుకోవడం. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దైవాన్ని తలచుకుంటూనే ఉండాలి. అది స్మరణ భక్తి అనిపించుకుంటుంది. నారాయణ నామస్మరణతో నారదుడు, హనుమంతుడు భగవంతుడికి దగ్గరయ్యారు. దైవం అనుసరించిన మార్గంలోనే నడవడం ‘పాద సేవ’ అవుతుంది. అంతేగాని ఎల్లప్పుడూ భగవంతుడి పాదాల మీదే తదేకమైన శ్రద్ధ కలిగి ఉండడం పాద సేవ కాదు.

భరతుడు రాముడి పాదుకలనే రామస్వరూపముగా భావించడానికి కారణం ఆయన అనుసరించిన మార్గాన్నే తానూ అనుసరించడం. గుహడు చేసిన పాద సేవకు పులకరించి అతడికి మోక్షాన్ని ప్రసాదించాడు రాముడు. ధూప దీపాలు వెలిగించడం, భౌతిక పదార్థాలైన కుంకుమ, అక్షతలు పూలతో దేవుడికి పూజ చేయడం అర్చన భక్తి. భౌతిక దేహంతో ప్రారంభించిన అర్చన క్రమంగా మానసికంగా దైవాన్ని దర్శించి, ఆ స్వామికి మనసనే కోవెలలో అర్చనలు చేసే స్థితికి చేరుకోవాలి. రామకృష్ణ పరమహంస కాళికాదేవిని అలాగే అర్చన చేసి తరించారు.

వందనం -అంటే నమస్కరించడం. తనలోని అహాన్ని విడిచిపెట్టి అవతలి వ్యక్తి గొప్పదనాన్ని అంగీకరించడమే వందనం లోని అంతరార్థం. అన్ని ప్రాణుల పట్ల దయతో ఉన్నా కూడా భగవంతుడికి వందనం చేసినట్లే. దైవ సేవకుడు ఎలా ఉండాలో హనుమంతుడు ఆచరించి చూపించినంతగా మరొకరు చూపించలేరు. భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి, ఆయనను ఆరాధిస్తూ ఉండటమే దాస్యం అవుతుంది. వనవాసంలో పద్నాలుగు సంవత్సరాల పాటు లక్ష్మణ స్వామి తన అన్నకు దాసుడిగా ఉండి సేవలు చేశాడు. అది దాస్య భక్తి.

మంచి స్నేహితునితో మెలిగినట్లే భగవంతుడితో స్నేహభావం ప్రదర్శించడమే సఖ్యభక్తి కి నిదర్శనం. కృష్ణుడితో పాండవులు, కుచేలుడు, సఖ్యతతో ఉండి నిరంతరము రక్షణ పొంది తమ జీవితాలను తరింప చేసుకున్నారు. తనను తాను పూర్తిగా భగవంతునికి సమర్పించుకోవడమే ఆత్మ నివేదనం. తనదంటూ ఏమీ ఉంచుకోకుండా అంతా పరమాత్మకు సమర్పించాలి. బలి చక్రవర్తి, గోదాదేవి, మీరాబాయి ఈ మార్గంలోనే ఉన్నతి పొందారు.

Share this post with your friends