రామాయణంలోని ఒక్కొక్క కాండంలో ఏముంటుందంటే..

వాల్మీకి రచించిన రామాయణ మహా కావ్యంలో మొత్తం ఏడు కాండలుంటాయి. వాటిలో ఆరింటిని మాత్రమే వాల్మీకి రచించారని.. ఏడవ కాండ మాత్రం ఆయన రచించలేదని అంటారు. రామయణంలో మొత్తం 24 వేల శ్లోకాలు ఉన్నాయి. ఇక రామాయణంలోని ఏడు కాండలేంటంటే.. మొదటిది బాలకాండం, రెండవది అయోధ్యకాండ.. మూడవది అరణ్యకాండ, నాల్గవది కిష్కిందకాండ, ఐదవది సుందరాకాండ, ఆరవది యుద్ధకాండ, ఏడవది ఉత్తరాఖాండ. ఈ ఉత్తరాఖాండనే వాల్మీకి రచించలేదని చెబుతారు. ఇక బాలకాండలో రామాయణ కథ ప్రారంభం, రాముని జననం, బాల్యం, విశ్వామిత్రునితో ప్రయాణం, యాగ పరిరక్షణ, సీతా స్వయంవరం, సీతారామ కల్యాణం గురించి ఉంటుంది. ఇక అయోధ్యకాండలో శ్రీరాముని పట్టాభిషేక సన్నాహాలు, కైకేయి కోరిక, దశరధుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము, వన ప్రయాణం, గుహుని ఆతిథ్యం, చిత్రకూట నివాసం, దశరథుని మరణం, భరతుని దు:ఖం వంటి అంశాలున్నాయి.

అరణ్యకాండంలో సీతారామ లక్ష్మణుల వనవాస కాలం, మునిజన సందర్శనం, రాక్షస సంహారం, శూర్పణఖ భంగం, సీతాపహరణం గురించి వివరించారు. కిష్కిందకాండలో రాముని దుఃఖం, హనుమంతుడు రాముడినికి, సుగ్రీవుడికి స్నేహం కల్పించుట, వాలి వధ, సీతాన్వేషణ వంటివి ఉంటాయి. సుందరకాండలో హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణం, లంకాదహనం, సీత జాడ తెలుసుకుని రాముడికి చెప్పడం వంటి అంశాలుంటాయి. యుద్ధకాండలో సాగరానికి వారధిని నిర్మించడం, యుద్ధం, రావణ సంహారం, సీత అగ్ని ప్రవేశం, అయోధ్యకు రాక, పట్టాభిషేకం గురించి ఉంటుంది. ఇక చివరిదైన ఉత్తరాఖాండలో సీతను అడవులకు పంపుట, లవకుశల వృత్తాంతం, సీత భూమిలో కలిసి పోవడం, రామావతార సమాప్తి ఉంటుంది.

Share this post with your friends