
ద్వైతం అనేది వ్యావహారికం, అద్వైతం అనేది పారమార్ధికం భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటే గాని మనం భగవంతుడిని పూజించలేము. జ్ఞానం వచ్చేంత వరకూ ద్వైతం ఉపయోగపడుతుంది. జ్ఞానం వచ్చిన తరువాత అద్వైతం ఉంటుంది. కలగంటున్న వరకు అది కల అని తెలియదు. బాహ్యస్మృతి లోకి వచ్చాక మాత్రమే అది కల అని తెలుస్తుంది. ద్వైతంలో ఉన్నా, విశిష్టాద్వైతంలో ఉన్నా చివరికి అద్వైతంలోకి రావలసిందే. ఎందుకంటే జగత్తు అంతా మిధ్య, బ్రహ్మం ఒక్కడే అంటే అందరూ అర్థం చేసుకోలేరు. ఈ ఉపాసనలు, ఆరాధనలు అద్వైతం కోసమే. కనుక ద్వైతంలోనే ఉంటూ చివరికి అద్వైతంలోకి చేరుకోవలసినదే.
ఏకేశ్వరోపాసన, బహు దేవతారధనలలో ఏది మంచిది?
ఏకేశ్వరోపాసన అంటే దేవుడు ఒక్కడేనని నమ్మి పూజించడం. హిందూమతంలో ఏకేశ్వరోపాసన చేసినా లేదంటే అనేక మంది దేవతలను పూజించినా ఏ వ్యత్యాసమూ లేదు. ఎందుకంటే.. భగవంతుడు ఒక్కడే కాని రూపాలు, నామాలు అనేకం ఉన్నాయి. ఆ రూపాల వెనుక ఉండే చైతన్యం మాత్రం ఒక్కటే. మనం ఈశ్వరుడిని ఆరాధించినా, విష్ణువుని ఆరాధించినా ఫలంలో ఎటువంటి తేడా ఉండదు. ఈశ్వరుడు ఎటువంటి ఫలాన్ని ఇస్తాడో, విష్ణువు అదే ఫలాన్ని ఇస్తాడు. ఇతర దేవతలు అదేవిధమైన ఫలాన్ని ప్రసాదిస్తారు.
