దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పూరి జగన్నాథుని రథ యాత్ర ఒకటి. ఈ రథయాత్రలో మూడు రథాలుంటాయి. చివరి రథం జగన్నాథ స్వామివారిది కాగా.. ముందు రెండు రథాలు.. బలభద్ర, సుభద్రల రథాలు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున జరుగుతుంది. ఈ లెక్కన ఈ ఏడాది జూన్ 7 నుంచి ప్రారంభం కానుంది. జగన్నాథుని రథయాత్ర ప్రధాన ఆలయం నుంచి మొదలై.. ఆయన అత్తింటి వద్ద ఆగుతుంది. ఇంతకీ అత్తిల్లు ఏదంటారా? ఆలయం నుంచి 3 కిలో మీటర్ల దూరంలో ఉండే గుండిచా ఆలయమే స్వామివారి అత్తిల్లు. ఇక్కడ జగన్నాథుడు 7 రోజులు విశ్రాంతి తీసుకొని తిరిగి తన ఇల్లైన ఆలయానికి చేరుకుంటాడు. దీనినే బహుదా యాత్ర అంటారు. మరి ఈ రథ యాత్ర పూర్తయ్యాక రథాలను ఏం చేస్తారు?
రథ యాత్ర పూర్తయిన తర్వాత రథం భాగాలను వేటికవి వేరు చేస్తారు. దీనిలో వేలం వేయాల్సినవేవో చూసి వాటిని వేలం వేస్తారు. ముందుగా వేలం వేసే భాగాల వివరాలను శ్రీజగన్నాథ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. రథం చక్రం అత్యంత ఖరీదైన భాగం. దీనికి రూ.50 వేలు ప్రారంభ ధరగా నిర్ణయిస్తారు. వెబ్‌సైట్‌లో వివరాల ఆధారంగాముందుగా దరఖాస్తు చేసకుని నియమ నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొంటారు. ఇక వేలంలో మిగిలిన కలపను ఆలయ వంటగదికి పంపిస్తారు. అక్కడ ప్రసాదం వండటానికి ఈ కలపను వినియోగిస్తారు. ఈ వంటగది కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇదొక మెగా కిచెన్. ప్రతి రోజూ స్వామివారి కోసం 56 రకాల నైవేద్యాలను అది కూడా మట్టి కుండల్లో తయారు చేయడం విశేషం.