బలరామకృష్ణులు ఒకరోజు తమ స్నేహితులతో కలిసి అక్కడి దగ్గరలో ఉన్న తాళవనంలోని పండ్ల కోసం వెళతారు. ఆ వనానికి ధేనుకుడు అనే రాక్షసుడు కాపలాగా ఉన్నాడు. అతడు గాడిద రూపంలో ఉన్నప్పటికీ మహా బలవంతుడు. ధేనుకుడు గురించి తెలుసుకుని ఆ వనం దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్లేవారు కాదు.. ఒకవేళ తెలియక ఎవరైనా వెళ్లినా కూడా తిరిగి వచ్చేవారు కాదు. అయితే బలరామకృష్ణులకు వారితో పాటు వెళ్లిన స్నేహితులు శ్రీదాముడూ, సుబలుడూ.. ధేనుకుడి గురించి ముందే చెప్పారు. అయినా సరే.. బలరామకృష్ణులు లెక్కచేయకుండా ఆ వనంలోకి వెళ్లారు. వనంలోకి వెళ్లగానే చెట్లను తన బాహువులతో చుట్టి పండ్లన్నింటినీ బలరాముడు రాల్చాడు.
పండ్లు రాలుతున్న శబ్దం విన్న ధేనుకుడు అరుస్తూ అక్కడకు వచ్చాడు. రాగానే బలరాముని రొమ్ముపై గట్టిగా తన్నడంతో ఆయనకు కోపం వచ్చింది. ధేనుకుని పాదాలు పట్టి లేపి చెట్టుకు కొట్టగా చెట్టు కూలిపోయింది. కూలుతూ అది మరికొన్ని చెట్లను తాకడంతో అవన్నీ పడిపోయాయి. ఈ శబ్దానికి ధేనుకుడి బంధువులంతా అక్కడకు వచ్చారు. ధేనుకుడితో పాటు అతని బంధువులందరినీ బలరామకృష్ణులు అవలీలగా సంహరించారు. రాలిన తాటి పళ్లను బలరామకృష్ణులు స్నేహితులకు పంచి పెట్టడంతో అంతా హాయిగా ఆరగించారు. అప్పటి నుంచి తాళ వనం బలరామకృష్ణులతో పాటు గోపబాలురందరికీ మంచి ఆటస్థలంగా మారిపోయింది.