నూరేళ్ల ఆయుష్షు కోసం గరుడ పురాణం ఏం చెప్పిందంటే..

నిండు నూరేళ్లు ఆరోగ్యం జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ పూర్వజన్మ కర్మ ఫలితమో మరొక కారణమో కానీ అర్థాయుష్షుతోనే కన్నుమూస్తారు. అయితే గరుడ పురాణంలో మృత్యువు గురించి కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. అవేంటో చూద్దాం. సమీప బంధువులు మరణిస్తే అంతిమ యాత్రకు శ్మశానం వరకూ వెళ్లడం కామనే. అయితే అక్కడ నుంచి వచ్చే పొగకు మాత్రం దూరంగా ఉండాలట. ఆ పొగలో విషపూరితమైన వైరస్, బ్యాక్టీరియా ఉంటుంది. దీర్ఘాయుష్షు కావాలనుకుంటే అవసరమైనంత మేరకే నిద్రపోవాలట. బారెడు పొద్దెక్కే వరకూ నిద్రపోవడమో లేదంటే సూర్యోదయానంతరం నిద్రపోవడమో చేయకూడదట. బ్రహ్మ ముహూర్తంలో లేస్తే దీర్ఘాయుష్షు ఉంటుందట.

సూర్యోదయం సమయంలో గాలిలో ఎలాంటి కాలుష్యమూ ఉండదు. కాలుష్య రహిత గాలి మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఆ సమయంలో లేవడం వలన ఆరోగ్యం చాలా బాగుంటుంది. గరుడ పురాణం ప్రకారం రాత్రిపూట పెరుగు కానీ పెరుగుతో చేసిన పదార్థాలు కానీ తినరాదు. ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది. తత్ఫలితంగా మరణం చేరువవుతుందట. అలాగే మహిళలను, పసిపిల్లలను, వృద్ధులను హింసించడం వంటివి చేయడం.. భక్తులను బాధించడం.. ఆహారం, నీళ్లు అడిగిన వారికి లేవని చెప్పడం వంటివి చేయకూడదట. తాత్కాలిక ప్రయోజనం ఆశించి చెడు మార్గంలో నడవకూడదని గరుడ పురాణం చెబుతోంది. చెడు పనులకు ఫుల్ స్టాప్ పెట్టేసి.. మంచి మార్గంలో నడిస్తే నూరేళ్లు జీవిస్తారట.

Share this post with your friends