పర్యంకాసనం సమయంలో ఎవరెవరు ఏమేం చేస్తారంటే..

తిరుమల శ్రీ మలయప్పస్వామివారి ఏకాంత సేవ సమయంలో ఒక్కొక్కరూ ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వెంగమాంబ వంశీయులు రంగవల్లులు వేస్తే.. పోటువారు వేడి ఆవు పాలు తీసుకొస్తారు. అలాగే సబ అరవాలు నైవేద్యాలు తయారు చేస్తారు. ఏమేం నైవేద్యాలు తయారు చేస్తారో కూడా తెలుసుకుందాం.

పంచకజ్జాయం
(జీడిపప్పు + పంచదార + యాలకులు + గసగసాలు + ఎండుకొబ్బరి)

మధురమైన పండ్లు, తాంబూలం, చందనం

అలాగే అర్చకస్వామి పంచపాత్రలలో బంగారు బిందెలో తీర్థం నింపి ఉంచుతారు. ఆలయ ఐతిహ్యం ప్రకారం.. రాత్రి తలుపులు మూసిన తరువాత బ్రహ్మాది దేవతలు వచ్చి శ్రీవారిని ఆరాధిస్తారని విశ్వాసం. అందుకే ఈ తీర్థం సిద్ధం చేస్తారు. ఈ తీర్థాన్ని ఉదయం సుప్రభాతసేవ తరువాత భక్తులకు ఇస్తారు. బ్రహ్మచే అభిషేకం చేయబడినది కాబట్టి దీనిని బ్రహ్మతీర్థం అంటారు. తరువాత శ్రీవారి బంగారు పాదకవచాలు తీసి రెండు చందనపు ముద్దలు పాదాలపై ఉంచుతారు.

ఒకటి — లక్ష్మీ అమ్మవారికి
ఒకటి — బ్రహ్మాది దేవతల ఆరాధనకు
అరముద్ద — భోగశ్రీనివాసుని హృదయంపై

తరిగొండ వంశీయులు ముత్యాలతో శ్రీవారి రూపం ఏర్పరిచి హారతి సిద్ధం చేస్తారు. చివరగా వైఖానస అర్చకులు మాత్రమే సన్నిధిలో ఉండగా రాములవారి మేడ తలుపులు మూసి భోగశ్రీనివాసుని దక్షిణం తలంపుగా శయనింపజేస్తారు. హారతి సమర్పణతో ఆ రోజు నిత్యకైంకర్యాలు ముగుస్తాయి. ఆ తరువాత శ్రీవారి నగలను పరిశీలించి మంత్రోచ్ఛారణ మధ్య తలుపులు మూసివేస్తారు. ఏకాంతసేవలో ఇంతటి తంతు జరుగుతుంది.

Share this post with your friends