రావణుడి మరణ వార్త తెలుసుకున్న మండోదరి ఏం చేసిందంటే..

మండోదరి మహా పతివ్రత. మయుడు, హేమల కుమార్తె. పది తలలు ఉన్న రావణాసురుని పట్టమహిషి. ఇంత గొప్పది. రావణుడి వక్షస్థలాన్ని చీల్చుకుని, గుండెను ఛేదించుకుని బాణం బలంగా భూమిలోకి దిగి తిరిగి రామచంద్రమూర్తి అక్షయ తూణీరంలోకి ప్రవేశిస్తే నెత్తురోడుతూ రావణుడు భూమ్మీద పడిపోయి ఉంటే.. గద్దలు, రాబందులు పైన ఎగురుతుంటే… దేవతలందరూ జయజయధ్వానాలు చేస్తుంటే… మండోదరికి కబురందించి పల్లకి పంపి పిలిపించారు. ఆవిడ యుద్ధభూమికొచ్చింది. రావణుడి శరీరానికి కొద్దిదూరంలో ఒక చెట్టుకింద రామలక్ష్మణులు, పక్కన విభీషణుడు నిలబడి ఉన్నాడు. సాధారణంగా ఆ పరిస్థితులలో ఉన్న ఏ స్త్రీ అయినా వెంటనే… రాముడెక్కడ? అని అడుగుతుంది లేదా తన భర్తను చంపేసాడన్న కోపంతో రాముడిని నింద చేస్తూ విరుచుకుపడుతుంది…. అని అనుకుంటారు.

కానీ మండోదరి ఎంత ధర్మాత్మురాలంటే… పల్లకీ దిగి రావణుడి దగ్గరకెళ్ళి ఏడుస్తూ… “వీళ్లందరికీ అమాయకత్వంతో తెలియని విషయం ఒకటున్నది రావణా! రాముడు నిన్ను చంపాడని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నీ భార్యను కనుక నాకు తెలుసు..! నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే. ఒకానొకనాడు నీవు తాచుపామును తొక్కిపెట్టినట్లు నీ ఇంద్రియాలను తపస్సు కోసం తొక్కిపట్టావు. నువ్వు బలవంతంగా వాటిని కోరికలకోసం తొక్కిపెట్టావు. తొక్కి పెట్టిన కాలుకింద నుంచి తప్పించుకున్న పాములా పగతో నీ ఇంద్రియాలు నిన్ను కాటేశాయి. యుక్తాయుక్త విచక్షణ తెలియలేదు. అయినా నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనిపించింది’’ అని ఆవేదన చెందింది.

Share this post with your friends