ఉపవాసం రకాలేంటి? ఎప్పుడు ఉపవాసం విరమించాలి?

ఉపవాసం వలన ప్రయోజనాలేంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఉపవాసం ఎన్ని రకాలు? ఎప్పుడు విరమించాలో తెలుసుకుందాం.

నిర్జల ఉపవాసం: 24 గంటల పాటు ఆహారం, నీరు కూడా ఏది తీసుకోకుండా చేయాల్సి ఉంటుంది.
జల ఉపవాసం: రోజంతా ఆహారం లేకుండా నీటిని తీసుకుంటూ చేసే ఉపవాసం
ద్రవ ఉపవాసం: ఈ ఉపవాసంలో ఘన పదార్థాలకు స్థానముండదు. కేవలం ద్రవ పదార్థాలైన టీ, కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు, పాలు, మజ్జిగ వంటి వాటిని మాత్రమే తీసుకోవాలి.
సాత్వికాహార ఉపవాసం: ఆరోగ్యం సహకరించని వారు ఇది చేయవచ్చు. సగ్గుబియ్యం, మఖానా, డ్రై ఫ్రూట్స్ వంటి తేలికపాటి సాత్వికాహారాన్ని ఉప్పు లేకుండా తినాలి.

అయితే ఉపవాసం చేసేవారు కొన్ని విషయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. శక్తి తగ్గకుండా ఉండాలంటే శారీరక శ్రమను తగ్గించి.. ధ్యానం, మంత్రోచ్ఛారణ, పుస్తక పఠనం చేయాలి. ఏవైనా అనారోగ్య సమస్యలున్నవారు ఉపవాసం చేయకపోవడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. శివునికి పూజ సమయంలో బిల్వ పత్రాలు, నీరు, పాలు సమర్పించండి. శివరాత్రి నాడు జాగరణ చేసి మెలకువగా ఉండండి. ఉపవాసం వల్ల శక్తి తగ్గకుండా ఉండాలంటే ఉపవాసానికి ముందు రోజు రాత్రి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కొవ్వు, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి. అంటే నెయ్యి, గింజలు, పనీర్, పెరుగు, కొబ్బరి, పండ్లు వంటివి తీసుకోవాలి.

ఉపవాస విరమణ ఎలా చేయాలంటే..

ఉపవాస విరమణ చేసిన వారు వెంటనే చకచకా ఆహారం తీసుకోవద్దు. ముందుగా డ్రైఫ్రూట్స్ లేదంటే పండ్లు, నానబెట్టిన గింజలు లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీరు వంటివి తీసుకోండి. ఆ తరువాత ఒక గంటకు ఆహారం తీసుకోవచ్చు.

Share this post with your friends