తుమ్మగుంటలో ఆలయ విశేషాలు చాలానే ఉన్నాయి. అదేమిటంటే ఈ ఆలయంలో మొదటి విశేషం ఏంటంటే.. ఒకవైపు విష్ణువు ఆలయం, మరోవైపు శివాలయం ఉన్నాయి. ఆసక్తికరంగా అయ్యప్పస్వామి.. శివకేశవుల మధ్యన వెలిశాడు. అలా శివకేశవుల మధ్య కొలువైన అయ్యప్ప ఆలయాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. 1938 లో శ్రీ శ్రీ శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు ఈ గ్రామంలో పర్యటించారట. అప్పుడు నిరాదరణకు గురైన అత్యంత అరుదైన ఏకశిలా శ్రీలక్ష్మీనారాయణుల విగ్రహాన్ని చూశారట. స్వామివారు అలా నిరాదరణకు గురవడాన్ని చూసిన ఆయన ఎంతో ఆవేదనకు గురయ్యారట.
గ్రామస్థులను ప్రోత్సహించి ఆలయ నిర్మాణం గావించి.. దానిలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే.. వైష్ణవ ఆలయంలో నంది వాహనం ప్రతిష్ఠించి ఉండటం. నాడు రాయలవారి ఏనుగులు స్నానం చేసిన నీటి గుంట ఏనుగు గుంటగా ప్రసిద్ధి చెందింది. అది నేటికీ సజీవంగానే ఉంది. 1995లో శ్రీ పూర్ణ పుష్కలా సమేత శ్రీ కల్యాణ వరద అయ్యప్ప స్వామి చిత్రపటాన్ని సైతం ఇక్కడ ఆవిష్కరించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. సతులతో కూడిన అయ్యప్పస్వామిని ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా దర్వించుకోలేం. అందుకే ఈ క్షేత్రంలో శ్రీ పూర్ణ పుష్కలా సమేత శ్రీ కల్యాణ వరద అయ్యప్ప స్వామిని దర్శించుకుంటే వివాహం కానివారికి తప్పకుండా వివాహం జరుగుతుందని విశ్వాసం.