
కన్వర్ యాత్ర గురించి ఇప్పటికే చాలా విషయాలు తెలుసుకున్నాం. ఆషాడ పౌర్ణమి నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. శివయ్యను అభిషేకించేందుకు భక్తులు గంగానది నుంచి కావడితో నీటిని తీసుకెళతారు. అయితే కన్వర్ యాత్ర నియమాలు ఏంటో తెలుసుకుందాం. ఆ నియమాలు సాదాసీదాగా ఏమీ ఉండవు. చాలా కఠినంగా ఉంటాయి. ఈ యాత్ర సమయంలో కాషాయ దుస్తులను మాత్రమే ధరించాలి. పూర్తిగా చెప్పులు లేకుండా కాలి నడకనే ఎన్ని కిలో మీటర్లైనా వెళ్లాల్సి ఉంటుంది. మద్యం, మాంసాహారం ముట్టకూడదు. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.
అలాగే యాత్రికులు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే.. కావడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై దించకూడదు. ఒకవేళ నేలపై దించితే కన్వర్ యాత్ర అసంపూర్ణమని భావించడంతో పాటు తిరిగి గంగా నది వద్దకు వెళ్లి కావిళ్లతో నీళ్లు తీసుకురావాల్సి ఉంటుంది. మరి ఎక్కడ పెడతారంటే.. కావడిని చెట్టుకు వేలాడదీస్తారు. అలాగే దించిన మీదట.. స్నానం చేసిన తర్వాతే కావిడిని తాకాలి. ఇక కావిళ్లతో నీళ్లు మోస్తున్నంత సేపు ‘ఓం నమ: శివాయ’ అనే పంచాక్షరి మంత్రాన్నే జపించాల్సి ఉంటుంది. ఎవరు పడితే వారు కావిళ్లను మోయకూడదు. శ్రావణ మాసంలో హరిద్వార్ ప్రస్తుతం కన్వర్ యాత్రికులతో సందడిగా ఉంది.
