వృద్ధురాలికి కన్నయ్య ఇచ్చినది వరమా.. శాపమా? ఆశ్చర్యపోయిన అర్జనుడు

ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక ఒంటరి వృద్ధురాలి ఇంటికి అతిథులుగా వెళ్లారట. ఆ వృద్ధురాలు శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు. ఆమె తన జీవితాన్ని మొత్తం కన్నయ్య ఆరాధనలోనే గడుపుతోంది. నా అన్నవాళ్లు లేక.. ఆదరించే దిక్కు లేక ఒక పూరి గుడిసెలో కాలం వెళ్లదీస్తోంది. ఆమెకు తోడుగా ఒక ఆవు ఉండేది. ఆ ఆవు పాలు అమ్మి తనకు కావల్సిన వస్తువులను కొనుక్కునేది. తనకు జీవనాధారమైన ఆవును అపురూపంగా చూసుకునేది. అయితే ఆమె ఇంటికి కన్నయ్య రావడాన్ని చూసిన వృద్ధురాలు అమితానందభరితురాలైంది. కన్నయ్య మాత్రమే కాకుండా ఆయనతో పాటు పార్థుడు కూడా తన వెంట రావడం చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అతిథి దేవోభవ అంటారు.

అలాంటిది ఏకంగా దేవుడే అతిథిగా వస్తే ఇక ఆ ఆనందానికి అవధులుంటాయా? వారిని చూడగానే సాదరంగా ఆహ్వానం పలికి వారికి తమ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను ప్రేమగా నివేదించింది. శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి, ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చాడు. ఆమె పెట్టినవన్నీ ఆరగించి ఆమెతో కాసేపు మాట్లాడి ఇద్దరూ అక్కడి నుంచి నిష్క్రమించారు. బయటకు రాగానే అర్జనుడు.. మాధవుడితో ‘మీరు ఆమె భక్తికి మెచ్చారు కదా..మరి ఆమెకు ఒక వరాన్ని ఎందుకు ఇవ్వలేదు?’ అని ప్రశ్నించాడు. దానికి కన్నయ్య.. ‘నేనెప్పుడో వరాన్ని ప్రసాదించా. రేపు ఆమె ఎంతో ప్రేమగా చూసుకుంటున్న గోవు మరణిస్తుంది’ అని చెప్పాడు. ఇది వరమెలా అవుతుంది? శాపం కదా. గోవు మరణిస్తే జీవినాధారం పోతుంది కదా అని తిరిగి ప్రశ్నించాడు. ఆమె గోవు సేవలో తరిస్తూ నన్ను స్మరించడం మర్చిపోతోంది కాబట్టి ఆవు లేకుంటే నా సేవలో తరించి జన్మను ధన్యం చేసుకుంటుంది. మరణానంతరం తప్పక తన లోకానికి చేరుకుంటుందని కన్నయ్య చెప్పాడు.

Share this post with your friends