
తిరుమల శ్రీవారిని దగ్గర నుంచి చూసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే మార్గమే తెలియదు. సిఫార్సు లేఖలు సంపాదించడం అందరికీ సాధ్యపడదు. అలాగని పది వేలు పెట్టి దర్శనం చేసుకునే స్తోమతా ఉండదు. అలాంటి వారి కోసం టీటీడీలో ఓ పథకం ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే దీనికి చాలా ఓర్పు కావాలి. శ్రీ వేంకటేశ్వర స్వామిపై విపరీతమైన భక్తి ఉన్నవారు మాత్రమే దీనిని చేయగలుగుతారు. వీఐపీ బ్రేక్ దర్శన్ కోసం తపించే సామాన్య భక్తుల కోసం టీటీడీ ఓ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీ మలయప్ప స్వామివారి గోవింద నామాలను 10,01,116 సార్లు రాస్తే.. వారికి.. వారి కుటుంబానికి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
అయితే ఇది చాలా కష్టతరమైనది. దాదాపు మూడేళ్ల పాటు దీక్షగా చేస్తే తప్ప పది లక్షలకు పైగా గోవింద నామాలను రాయడం సాధ్యం కాదు. ఇప్పటి వరకూ ఈ అవకాశాన్ని కేవలం ముగ్గురు మాత్రమే వినియోగించుకున్నారు. దీనికోసం గోవింద కోటి నామాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. టీటీడీ సమాచార కేంద్రాలు.. పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్‌లైన్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. 26 పుస్తకాలను కొనుగోలు చేస్తే కానీ 10,01,116 నామాలు రాయడానికి అవదు. దాదాపు మూడేళ్లపాటు శ్రద్ధ పెడితే ఈ పుస్తకాలన్నీ రాయడం పూర్తి కాదు. అయితే ఇక్కడ ఓ నియమాన్ని కూడా టీటీడీ పెట్టింది. ఈ గోవింద నామాలు రాసే వారి వయసు 25 ఏళ్లకు మించి ఉండకూడదు.
