
మన ధర్మానికి మూలపురుషులైన వేదవ్యాసుల వారిని స్మరించుకోవడానికి వచ్చినదే వ్యాస పౌర్ణమి. వ్యాసులు పదునెనిమిది పురాణాలను కూడా రచించి, జ్ఞానము భగవద్భక్తి కలిగిన సూతునకు ఇచ్చి వాటిని ప్రచారం చెయ్యమని చెప్పారు. తరువాత అనంతములైన వేదములను సంగ్రహంగా బ్రహ్మసూత్రాలుగా రాశారు. ఆ బ్రహ్మ సూత్రాలకు గొప్ప గొప్ప ఆచార్యులు వ్యాఖ్యానాలు లేదా భాష్యాలు వ్రాసారు. అందులో శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజులు, శ్రీ మధ్వాచార్యులు రాసిన బ్రహ్మసూత్ర భాష్యాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. తరువాతి కాలంలో సిద్ధాంతాల పరంగా విభేదాలు వచ్చినప్పటికి వీటీకి మూలమైన బ్రహ్మసూత్రాలు వేదవ్యాస ప్రణీతమని మరువరాదు.
మన ఆధ్యాత్మిక సంస్కృతి, ఆదిభౌతిక ఆలోచనా విధానం వల్లే మన దేశం ప్రపంచ దేశాల వందనములు స్వీకరిస్తోంది. మనకు వేదములను ప్రసాదించిన వేదవ్యాస మహర్షులను పరంపరాగతంగా వీటిని మనకు అందిచిన ఋషులను గుర్తుపెట్టుకుని కృతజ్ఞతా భావంతో ప్రణమిల్లడం మన అందరి కర్తవ్యం. మనకు వేదములతో పాటు ధర్మసూత్రములు కూడా ఉన్నాయి. అవి మనము వేదములు చదివే అర్హతను పొందడానికి చెయ్యవలసిన చెయ్యకూడని విధులగురించి, మన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెబుతాయి. వాటినే స్మృతులు అని కూడా అంటారు. అవి ఒక్కొక్క ఋషిపేరు మీద పరాశర స్మృతి, యాజ్ఞ్యవల్క్య స్మృతి, మనుస్మృతి మొదలుగునవిగా చెప్పబడ్డాయి.
