అగస్త్య మహాముని చేతిలో పూదండ తాకి విష్ణువే శివుడిగా మారిపోయాడట..

కుట్రాల అనే పుణ్యభూమిని పృథువు అనే రాజు పాలిస్తుండేవాడు. ఆ రాజ్యంలో రోచిష్మానుడు, సురుచి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు చతుర్వేదాలతో పాటు సకల శాస్త్రాలను అభ్యసించి మంచి విష్ణు భక్తులుగా మారిపోయారు. వీరిద్దరూ విష్ణుభక్తిని పారాయణం చేస్తూనే శివనింద చేసేవారు. ఇది పృథువు చెవిన పడటంతో ఆయన సహించలేక నేరుగా కైలాసానికి వెళ్లి.. అక్కడ శివునితో.. తన రాజ్యంలో శివభక్తి పారాయణాలు తప్ప మరేమీ లేకుండా చూడాలని వేడుకున్నాడు. దీనికి సరేనన్న శివుడు.. అగస్త్య మహామునిని కార్యార్థమై పంపిస్తాడు. అగస్త్య మహాముని కుట్రాలంలో ఉన్న విష్ణు సన్నిధికి చేరుకుంటాడు. ఆయన్ను చూసిన విష్ణు భక్తులు ఆ సన్నిధిలోకి రాకుండా అడ్డుకున్నారు.

మరుసటి రోజు అగస్త్య మహాముని విష్ణుభక్తుని రూపంలో ఆలయానికి వెళ్లాడు. ఆయనను సాదరంగా ఆహ్వానించిన విష్ణు భక్తులు స్వామివారికి పూజా విధులు నిర్వహించమని కోరుతారు. అయితే అగస్త్యుడు శివుని ధ్యానిస్తూ తన చేతిలో ఉన్న పూలదండతో విష్ణుమూర్తి ప్రతిమను తాకగా.. అది వెంటనే శివలింగంగా మారిపోతుంది. దీంతో విష్ణు భక్తులు గొడవకు దిగుతారు. అప్పుడు ఆకాశవాణి.. మధ్యవర్తిని నియమించుకుని వాదనలు చేసుకోవాలని కోరగా.. ఆ మరుక్షణమే శివుని ఎడమభాగంవైపునున్న ధరణి పీఠం నుంచి ఒక దేవి ఆవిర్భవించింది. వాదోపవాదనల్లో ఓడిన వారు గెలిచిన వారి మతాన్ని అనుసరించాలి. వాదోపవాదనల్లో విష్ణు భక్తులు ఓడిపోయి శివదీక్షను స్వీకరించారు. అయితే వీరిద్దరి వాదనకు మధ్యవర్తిత్వం వహించింది ఆ పరాశక్తియేనని చెబుతారు.

Share this post with your friends