వినాయకచవితి అనగానే మనకు గుర్తొచ్చేది కాణిపాకంలో కొలువైన వరసిద్ధి వినాయకుడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారికి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇవాళ తెల్లవారుజామునే వినాయక చవితి వేడుకలు కాణిపాకంలో ప్రారంభమయ్యాయి. భక్తజనంతో కాణిపాకం పోటెత్తింది. తెల్లవారుజామున 2 గంటలకు ఉభయదారులు స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత నుంచి అంటే ఉదయం 3 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తోంది. క్యూలైన్లలో భక్తులు భారీగా వేచి ఉన్నారు.
ఇక నేడు వినాయక చవితి వేడుకలతో పాటు ఇరవై ఒక్క రోజుల వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. స్వామివారికి ఉదయం 9 గంటలకు స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా యంత్రాంగం ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించారు.ఇక స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.