
మహాశివరాత్రి ఈ నెల 26న దేశమంతా జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో వనితా టీవీ ప్రత్యేకంగా శివయ్య భక్తుల కోసం ఒక పాటను రూపొందించి భక్తుల కోసం ప్రోమోను విడుదల చేసింది. ప్రముఖ గాయకులు గోరేటి వెంకన్న, సినీ గాయకుడు రేవంత్ ఈ పాటను ఆలపించారు. ఈ భక్తి గీతం వింటుంటే.. మనసు ఆధ్యాత్మికత భావనకు గురవడం ఖాయం. ఆ పరమేశ్వరుడి జాడ తెలియక భక్తుడు ఆవేదనతో పాడుతున్న గేయమది. ఒకవైపు శివయ్య జాడ కనుక్కుంటూనే స్తుతిస్తూ సాగుతుంది.
‘దేవ దేవ శంకరా దేవ శంభో శంకర దేవులాడినేడ దొరకవా.. ఆది ఆది శంకర యాడ తిరుగుతున్నవు జాడ తెలవకున్నవేందిరా’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. చరణ్ అర్జున్ అందించిన స్వరాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రోమోనే ఇలా ఉంటే పూర్తి పాట ఎలా ఉంటుందోనని అంతా చర్చించుకుంటున్నారు. ఈ పాట శివరాత్రికి అన్ని దేవాలయాల్లోనూ మారుమోగడం ఖాయమని భక్తులు అంటున్నారు. దీనిని విడుదల చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు మూడు మిలియన్ల వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఇప్పటి వరకూ వినకుంటే ఒకసారి వినండి.
