తెల్లని పూల మధ్య మెరిసిపోయిన వనదుర్గా భవాని..

మెడక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారు. మెదక్ నుంచి 19.5 కిలో మీటర్ల దూరంలో ఉంటుందీ ఆలయం. కనకదుర్గమ్మ ఈ ఆలయంలో కొలువై ఉంటారు. అమ్మవారు నిన్న ధవళవర్ణంతో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారిని పూర్తిగా తెల్లని పూజలతో విశేషాలంకరణ చేశారు. మల్లెపూలు, సన్నజాలు, లిల్లి పూలతో ఆలయాన్ని అలంకరించారు. తెల్లని పూల నడుమ అమ్మవారు మరింత శోభాయమానంగా మెరిసిపోయారు. చల్లని చూపుతో తెల్లని పూల మధ్య అమ్మవారు భక్తులను చూపు తిప్పుకోనివ్వలేదు. ఈ క్రమంలోనే అమ్మవారికి సహస్రనామార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెల్లని పూలతో అమ్మవారిని పూజించడానికి కారణమేంటి? అంటారా? ఇలా మల్లెపూలు, సన్నజాజులు, లిల్లీ వంటి తెల్లని పూలతో అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, మనశ్శాంతి, సంతానం కలుగుతుందనీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఇక్కడి అమ్మవారిని అత్యంత శక్తివంతమైన తల్లి అని చెబుతారు. కోరిన కోరిక ఏదైనా సరే తప్పక నెరవేరుస్తుందట. పచ్చని అడవి, గుహ లోపల సహజమైన రాతి నిర్మాణాల మధ్య అమ్మవారి ఆలయం ఉంటుంది. మంజీర నదిలో ఏడు వాగుల సంగమాన్ని ఈ ఆలయం సూచిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు.

Share this post with your friends