నేటి నుంచి వైశాఖ మాసం ప్రారంభం.. ఈ మాసం విశిష్టతేంటంటే..

తెలుగు మాసాల్లో ప్రతి ఒక్క మాసానికీ ఓ విశిష్టత తప్పనిసరిగా ఉంటుంది. చైత్ర మాసం నిన్నటితో ముగిసింది. నేటి నుంచి వైశాఖ మాసం ప్రారంభమైంది. తెలుగు నెలల్లో రెండో నెల అయిన ఈ వైశాఖ మాసంలో ఏం చేస్తే మనకు బాగుంటుందనేది తెలుసుకోవాలి. ఈ వైశాఖ మాసం శ్రీ మహా విష్ణువుకు ప్రీతి కరమైంది. కాబట్టి వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు. ఈ నెలలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని కలిపి తులసి దళాలతో పూజిస్తే ముక్తి లభిస్తుందని నమ్మకం. అంతేకాకుండా ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తే మనకు మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇక ఈ నెలలో చేసే యజ్ఞ, యాగాలకు మరింత ప్రాధాన్యం ఉంటుందట.

వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలట. అలా చేస్తే ఉత్తమగతులు లభిస్తాయని పండితులు చెబుతారు. స్నానానంతరం ఉదయం రావి చెట్టుకి నీరు పోసి ప్రదక్షిణలు చేసి దీపం పెట్టడం వలన మన పూర్వీకులంతా తరిస్తారట. ఈ మాసంలో అభిషేక ప్రియుడైన శివునికి అభిషేకం చేస్తే మనం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయట. శ్రీ మహావిష్ణువు స్వయంగా లక్ష్మీదేవికి వైశాఖ మాస విశిష్టతను వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నెలలో ఈ రోజు ఆ రోజు అని కాకుండా అన్ని రోజులూ చాలా మంచివట. ఈ మాసంలో నదీ స్నానం చాలా మంచిదట. పైగా ఈ నెల నుంచి మూడు నెలల పాటు నారాయణుడు భూమిపై విహరిస్తాడని చెబుతారు.

Share this post with your friends