మహా కుంభమేళాకు దాదాపుగా అన్నీ ఏర్పాట్లు పూర్తి కావొస్తున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళా జరగనుంది. దీనికోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పకడ్బంధీగా ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈ సారి టెక్నాలజీని బాగా వినియోగించుకుంటోంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈసారి మహాకుంభమేళాలో అండర్ వాటర్ డ్రోన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికోసం ఇప్పటికే ట్రయిల్స్ కూడా నిర్వహించారు. మహాకుంభమేళాలో స్నానమాచరిస్తూ పొరపాటున ఎవరైనా నీళ్లలోకి మునిగిపోతే తక్షణమే అండర్ వాటర్ డ్రోన్లు గుర్తించి కాపాడుతాయి.
మరోవైపు ప్రయాగ్‌రాజ్‌కు మహాకుంభమేళాకు వచ్చే పర్యాటకుల వసతి సహా భద్రత కోసం పకడ్బందీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మహాకుంభమేళాలో ఎలాంటి తప్పిదాలు దొర్లకుండా అధికారులు పకడ్బంధీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలాంటి తప్పిదాలూ జరగకుండా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. మకర సంక్రాంతి నుంచే ఈ కుంభ స్నానం మొదలుకానుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభ మేళా ప్రారంభమవుతుంది. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా సందడి ప్రారంభమైంది. రైల్వే, ఆర్టీసీ సంస్థలు ఇప్పటికే అదనపు సర్వీసులను ఏర్పాటు చేశాయి.