వేసవి సెలవులు కావడంతో పాటు విద్యార్థులకు పరీక్షల ఫలితాలు వెలువడటంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. కొండపై భక్తులు దర్శనానికి బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలోనే భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శుక్ర, శనివారాల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. జూన్ 30వ తేదీ వరకూ ఈ నిర్ణయం అమలు కానుంది. ముఖ్యంగా వీకెండ్స్‌లో రద్దీ మరింత పెరుగుతోంది. దీంతో సామాన్యుల దర్శనాలకు 30 – 40 గంటల పాటు పడుతోంది.
కాబట్టి సామాన్య భక్తులందరికీ త్వరితగతిన దర్శనావకాశం కల్పించేందుకు వీకెండ్స్‌లో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ మార్పును గమనించాలని భక్తులను టీటీడీ కోరింది. జూన్ 30వ తేదీ వరకూ తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను అనుమతించబోమని టీటీడీ వెల్లడించింది. ఈ మార్పును భక్తులంతా గమనించి సహకరించాలని కోరింది. ఇవాళ కొండపై క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి. రింగ్ రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకూ భక్తులు క్యూ కట్టారు. క్యూ కాంప్లెక్స్‌లు దాటి క్యూ దాదాపు 3 కిలోమీటర్ల మేర విస్తరించింది.