తిరుమల హోటల్స్‌పై టీటీడీ ఈవో ఫోకస్..

తిరుమలకు విచ్చేసే శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించడమే తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష్యమని ఈవో శ్రీ జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో శుక్రవారం సాయంత్రం ఈవో, జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి తిరుమలలోని పెద్ద, జనతా హోటళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రముఖ హోటళ్లతో జాబితా రూపొందించడానికి ఇండియన్ క్యులినరీ ఇన్‌స్టిట్యూట్ అధ్యాపకులు శ్రీ చలేశ్వరరావు, తాజ్ హోటల్స్ (జిఎం) శ్రీ చౌదరి, సూచనలను ఆహ్వానించినట్లు తెలిపారు.

ముందుగా తిరుమల ఎస్టేట్స్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ మల్లిఖార్జున పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తిరుమలలోని హోటళ్ల గురించి వివరించారు. అనంతరం టీటీడీ ఐటీ విభాగంపై సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఐటి విభాగము భక్తులకు అందిస్తున్న వివిధ సేవల గురించి జియో బృందంతో ఆయన సమీక్షించారు. అనంతరం ఆలయ సిబ్బంది, పోటు కార్మికులతో సేంద్రియ ప్రసాదాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ రాజేంద్ర, క్యాటరింగ్‌ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ట్రాన్స్‌పోర్ట్ (జిఎం) శ్రీ శేషారెడ్డి, ఐటీ మేనేజర్ శ్రీ నాదముని, జియో సంస్థ ప్రతినిధులు శ్రీ మోషిన్ అబ్బాస్, శ్రీ విజయ్ కుమార్, శ్రీ మంజీత్, పోటు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Share this post with your friends