పరమాత్ముడు ఎఫ్పుడూ ఒక్కడే. ఆయన ప్రతి ఒక్క జీవిలోనూ ఉన్నాడు. అయితే ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు కాబట్టే మనం గ్రహించం. సూర్యుడు ఒక్కడే కానీ ఆయన ప్రకాశం అనేది నీటిపై ఒకలా.. నేలపై ఒకలా.. అలా ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అలాగే పరమాత్మ కూడా ఒక్కడే. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కదా.. మరి ఒక్కరని ఎలా అంటారని అడగవచ్చు. ఇక్కడ మనం గ్రహించాల్సిన సత్యం ఒకటుంది. అదేంటంటే.. సృష్టించే టప్పుడు బ్రహ్మ, పోషించేటప్పుడు విష్ణువు, లయం చేసేటప్పుడు శివుడుగా భగవంతుడు ఉంటాడు.
మనమే అది తెలుసుకోలేక అజ్ఞానంతో వారిని వేరు వేరుగా అనుకుంటూ ఉంటాము. అలాగే నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అని వాదులాడుకుంటూ ఉంటాం. దేవుడు ఎప్పుడూ గొప్పవాడే. ఆయనకు నీ నా అన్న భేదం లేదు. పరమాత్మకు జీవాత్మకు మధ్య మాయ అనే అడ్డు తెర కారణంగా మనం ఆయనను దర్శించుకోలేం. ఆ మాయను దాటగలిగితే పరమాత్మను దర్శించుకోగలుగుతాం. ఈ పరబ్రహ్మ తత్వము ఎక్కడో లేదు అందరి హృదయములలో అదిష్టానంగా ఉంటుంది. అచితూ మపం ఆ స్వరూపాన్ని మనం దర్శించుకోం అంతే. దీనికి కారణం లేకపోలేదు. మనకు బయట ప్రపంచంపై ఉన్న మమకారం మన ఆత్మస్వరూపుడి మీద ఉండదు.