రేపు మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణం.. దీని కోసం బియ్యపు గింజలపై..

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలోని లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే రేపు బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికోసం భక్తుల ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తరలి రానున్నారు. ఈ స్వామివారిని భక్తితో మొక్కాలే కానీ కోరిన కోరికను తప్పక నెరవేస్తాడని నమ్మకం. అందుకే స్వామివారి ఉత్సవాలకు తప్పని సరిగా హాజరవుతూ ఉంటారు. కోరికలు తీర్చే లక్ష్మీ నారసింహుడి విషయంలో భక్తులు ఒక్కో రీతిలో తమ భక్తిని చాటుతూ ఉంటారు.

ఇక ఓ విద్యార్థిని స్వామివారిపై తన భక్తిని ఆసక్తికరంగా చాటుకుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని రెడ్డికాలనీకి చెందిన గేయ వర్షిణి లక్ష్మీనరసింహ స్వామివారి భక్తురాలు. స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గేయవర్షిణి మండల కాలంగా అంటే 41 రోజులుగా మౌనవ్రతం ఆచరిస్తూ స్వామివారి నామాన్ని బియ్యపు గింజపై స్కెచ్ పెన్నుతో రాసింది. ఈ ఏడాది సంక్రాంతి పర్వదినం అనంతరం నుంచి బియ్యపు గింజలపై నర్సింహుడి నామాన్ని రాయడం మొదలు పెట్టింది. ఈ నెల 21వ తేదీన మట్టపల్లిలో జరగనున్న లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవంలో ఈ బియ్యాన్ని అందజేయనుంది. స్వామివారి కల్యాణ తలంబ్రాలలో ఈ బియ్యాన్ని కలపాలని కోరుతోంది.

Share this post with your friends