తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన స్థానికాలయాల్లో ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. శ్రీ గోవింద రాజస్వామి ఆలయం, శ్రీ కోదండరామాలయంలోఇవాళ ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఆణివార ఆస్థానం అంటే మరేమీ లేదు.. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువును ఆణివార ఆస్థానం అని పిలుస్తారు. పూర్వం మహంతులు ఇదే రోజున దేవస్థాన పరిపాలనను స్వీకరించారట. అప్పటి నుంచి ఆణివార ఆస్థానం ఈ పర్వదినం నాటి నుంచి ప్రారంభిస్తున్నారు. ఇవాళ టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలను ప్రారంభిస్తారు.
అయితే టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చడం జరిగింది. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆణివార ఆస్థానం సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకూ జరగనుంది. ఆలయంలో బంగారు వాకిలి వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేసిన అనంతరం ఈ ఆణివార ఆస్థానాన్ని నిర్వహిస్తారు. కోదండరామాలయంలో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య జరుగనుంది. ఇక్కడ శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను గరుడాళ్వార్ ఎదురుగా వేంచేపు చేసిన అనంతరం ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు.