
‘వాడు నన్ను సాయం అడిగాడా..? వాడికి నేను సహాయం చేయటానికి..! వాడికి నేను అడగకుండానే సహాయం చేశాను. కానీ అతనికి కృతఙ్ఞత లేశమంతయినాలేదు’ ఇలాంటి మాటలు మనం నిత్య జీవితంలో చాలా వింటుంటాం. ఎదుటి వాడికి సహాయం చేసి వాడి నుంచి తిరిగి మనం ఏదో ఒకటి ఆశిస్తున్నాం. ఏదీ లేక పోతే కనీసం కృతఙ్ఞత ఆశిస్తున్నాం. ఇదెలా ఉందంటే.. ‘‘ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం’’ లాంటిది. ఆశించి చేసేది సహాయం అవుతుందా…? అనేది మాత్రం ఆలోచించము. దీని గురించే భర్తృహరి ఒక చక్కని సుభాషితం చెప్పాడు. ‘‘పద్మాకరమ్ దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాలమ్ నాభ్యర్ధితో జలధరోపి జలం దదాతి సన్తఃస్వయమ్ పరహితే విహితాభియోగః’’
ఏమి ఆశించి సూర్యుడు తామర కొలను వికసింప చేస్తున్నాడు…? ఏమి ఆశించి చంద్రుడు కలువలను వికసింప చేస్తున్నాడు? ఏమి ఆశించి మేఘం నీటిని మానవాళికి అందిస్తున్నది? ఏమి ఆశించ కుండా పరులహితం కోరేవాడే సత్పురుషుడు. మనకు మనం ఎప్పుడూ గొప్పవాళ్లు గానే మనం భావిస్తాం.. మన మంచి మనకు ఎప్పుడూ గుర్తుంటుంది. మనం నిజంగా గొప్పవాళ్ళమే అయితే, నిజంగా మనం సత్పురుషులము అని మన మనస్సాక్షి ఒప్పుకుంటే, మనం చేసేది సహాయమే అని మనం భావించేటప్పుడు, ఎదుటివాడు అడగకుండానే ఎందుకు సహాయం చేయకూడదు..? ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులెందరో కానీ ఏదీ శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతం కాదు. నీ నడవడిక శాశ్వతం. గెలిచేది నువ్వే.. ఒడేది నువ్వే.. గెలుపుకి పొంగి పోకుండా, ఓటమికి కుంగిపోకుండా.. ధర్మబద్ధంగా ఫలాపేక్ష లేకుండా, తోటి వారికి చేతనైన విధంగా సహాయపడుతూ సాగిపోవడమే జీవితం.
