శ్రీవారి ప్రసాదాలు తినకుండా నిషేధించిన థామస్ మన్రో..

కడుపు నొప్పికి మంత్రం శ్రీ వేంకటేశ్వర స్వామివారి పులిహోరేనట. తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజూ నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళంలో మాత్రమే నివేదిస్తారు. అసలు ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏమిటో తెలుసుకోవడానికి ముందు థామస్ మన్రో ఏం చేశాడో తెలుసుకుందాం. 1800 ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు, నైవేద్య నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు. అప్పట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక.. తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి.

అక్కడక్కడా రామానుజ కూటముల ద్వారా కూడా అన్న సంతర్పణ జరిగినా ఆలయంలో పంచి పెట్టే ప్రసాదాలే ఆనాటి భక్తులకు ప్రధాన ఆహారం. 1800 ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో పని చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్‌గా పని చేసిన అధికారి పేరు.. థామస్ మన్రో. దక్షిణ భారతదేశం.. ప్రముఖంగా రాయలసీమ, కంచి ప్రాంతంలో ఆయన ఏలుబడి కింద ఉండేది. ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు. మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడు. ఉద్యోగ రీత్యా చాలా సార్లు తిరుమల వచ్చినా.. ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోలేదు. అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు.

అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి, పులిహారా, దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు. ఆ ప్రసాదాలను భక్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద కూర్చుని నేరుగా చేతులతో తన్మయత్వంలో తినడం చూసి థామస్ మన్రోకి ఒకరకమైన అసహ్యం వేసింది. స్వతహాగా విదేశీయుడు కావున… అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్దతి కాదు అని, శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఓకేదగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటు వ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని.. మన ఆలయ సంప్రదాయం, ప్రసాదాలు పట్ల ఒకింత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు ఇచ్చాడు.

Share this post with your friends