ఈ కన్నయ్యని దొంగిలించి తెచ్చారట.. గుర్తు పట్టకుండా ఉండటం కోసం..

శ్రీకృష్ణుడి ఆలయాలకు ఒక్కో దానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అలాగే సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో ఓ కన్నయ్య ఉంటాడు. ఈ శ్రీకృష్ణుడు కోర మీసాలతో దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి ఓ ఆసక్తికర చరిత్ర ఉంది. అదేంటో చూద్దాం. క్రీస్తు పూర్వం ఉన్నా లేకున్నా రాజులకు మాత్రం శిస్తు కట్టాల్సి వచ్చేది. శిస్తు కట్టేందుకు డబ్బు లేక చెల్లాపూర్ వాసులంతా కలిసి డబ్బులేసుకుని ఓ గుడిని నిర్మించేసి కప్పానికి ఎగనామం పెట్టాలనుకున్నారు. అనుకున్నట్టుగానే గుడి నిర్మాణం జరిగింది కానీ విగ్రహం లేకుండా పోయింది. ఉన్న డబ్బు పూర్తిగా అయిపోయింది. విగ్రహం కొనే స్తామత లేదు. దీంతో విగ్రహం కోసం అన్ని గ్రామాల్లో గాలించారు.

నంగునూరు మండలం రాజగోపాలపేట గ్రామ సమీపంలో ఓపాడు బడ్డ ఆలయంలో శ్రీకృష్ణుని విగ్రహం కనిపించిందట. దొరికిందే తడవుగా రాత్రికి ఆ విగ్రహాన్ని లేపేసి ఎడ్లబండిపై చెల్లాపూర్ తీసుకొచ్చి ఊరు పక్కనే ఉన్న చెరువులో దాచేశారు. అయితే ఆ విగ్రహాన్ని రాజగోపాల పేట గ్రామస్తులు గుర్తు పడతారేమోనన్న భయంలో విగ్రహానికి వెండితో కోర మీసాలు పెట్టి గుడిలో ప్రతిష్టించారట. అప్పటి నుంచి మీసాల కృష్ణుడిగా కన్నయ్య ఆ ఆలయంలో పూజలందుకుంటున్నాడు. ఈ గుడిలో ప్రతిష్టించిన దీపాన్ని నందా దీపం అంటారు. ఇది ఇప్పటి వరకూ వెలుగుతూనే ఉంది. అలాగే గుడిలోని కోనేటి నీరు ఇంతవరకూ ఎండిపోయిందే లేదట. ఇక్కడి మీసాల కన్నయ్య కారణంగా తమ గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉందని అక్కడి వారి నమ్మకం.

Share this post with your friends