ఈ ఆలయం ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే తెరిచి ఉంటుంది.. ఇదెక్కడుందంటే..

దేవాలయం అంటే రాత్రి సమయంలో మినహా రోజంతా తెరిచే ఉంటుంది. అయితే ఓ ఆలయం మాత్రం ఏడాదికి ఒక్కసారే తెరుస్తారు. ఆ ఒక్క రోజు సైతం పూజలు నిర్వహించి.. భక్తులు దర్శనం చేసుకున్న వెంటనే తిరిగి ఆలయాన్ని మూసేస్తారు. అసలు ఈ ఆలయం ఏ రోజున తెరుచుకుంటుంది? ఈ ఆలయం ఎక్కడుంది? వంటి విషయాలను తెలుసుకుందాం. పాములను సైతం నాగ దేవతగా మనం పూజిస్తూ ఉంటాం. దాదాపు అన్ని ఆలయాల్లోనూ నాగదేవత విగ్రరహం ఉంటుంది. ఇక మనం చెప్పుకుంటున్న ఆలయమైతే ప్రత్యేకంగా నాగ దేవత ఆలయమే. శ్రీ నాగచంద్రేశ్వర ఆలయం. ఉజ్జయినిలోని శ్రీ మహాకాళ ఆలయ గర్భగుడి పైన, ఓంకారేశ్వర్ ఆలయం, దానిపైన శ్రీ నాగచంద్రేశ్వరుని ఆలయం నిర్మించబడింది.

శ్రీ నాగచంద్రేశ్వరుని ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయంలో శ్రీ నాగచంద్రేశ్వరుడితో పాటు శివపార్వతుల విగ్రహాలు, నంది విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయ మరో విశిష్టత ఏంటంటే.. పరమేశ్వరుడు తన కుటుంబంతో పాటు పాముతో మంచంపై కూర్చుకున్న ఏకైక ఆలయం. శివుని మెడ, భుజాలను చుట్టుకుని పాము ఉన్న ఆలయం ఉజ్జయినిలో మినహా మరెక్కడా కనిపించదట. ఈ శివయ్యను దర్శించుకుని లోపలకు వెళితే శ్రీ నాగచంద్రేశ్వరుని ప్రధాన విగ్రహం లింగ రూపంలో దర్శనమిస్తుంది. శ్రీ నాగచంద్రేశ్వర మహాదేవుని ఆలయం ఏడాదిలో 24 గంటల పాటు మాత్రమే తెరిచి ఉంటుంది. అది కూడా కేవలం నాగపంచమి రోజున మాత్రమే. ఆ రోజున అర్ధరాత్రి 12 గంటలకు పూజలు ముగియగానే ఆలయాన్ని మూసేస్తారు.

Share this post with your friends