భోళా శంకరుడు తన భక్తులను కటాక్షించడానికి స్వయంభువుగా చాలా చోట్ల వెలిశాడు. దాదాపు అన్ని చోట్ల స్వామివారు లింగరూపుడై దర్శనమిస్తున్నాడు. తమిళనాడులో తంజావూరు జిల్లా పాపనాశనం తాలూకాలోని ‘తిరుక్కరుగావూర్’ పుణ్యక్షేత్రం పరమశివుడు స్వయంభువుగా వెలిసిన ప్రాచీన క్షేత్రాలలో ఒకటి. అభిషేక ప్రియుడైన స్వామివారికి ఎక్కడైనా జలంతోనూ.. పంచామృతాలతోనూ అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఇక్కడి శివయ్యకు మాత్రం పూలతో మాత్రమే అభిషేకిస్తూ ఉంటారు. ద్రవ పదార్థాలతో అభిషేకాలు చేయరు. కారణమేంటంటే.. ఇక్కడి శివలింగం పుట్ట మన్నుతో ఏర్పడింది.
తిరుక్కరుగావూర్ పుణ్యక్షేత్రంలో పరమశివుడు ముల్లైవనాథర్‌గా పూజలందుకుంటున్నాడు. ఆసక్తికరంగా.. ఎక్కడా లేని విధంగా ఇక్కడి శివలింగం పుట్టమన్నుతో ఏర్పడింది. అందుకే ఈ శివలింగానికి పుష్పాలతోనే అభిషేకం జరుగుతుంది. ఇక ఈ స్వామివారిని చాలా మంది గొప్ప శైవ భక్తులు కొలిచారట. వారిలో తమిళనాట గొప్ప కవిగా ఖ్యాతికెక్కిన జ్ఞాన సంబంధర్, సుందరార్ ఉన్నారు. ఇక ఇక్కడ పరమశివుడి విశిష్టత ఏంటంటే.. ఈ ఆలయంలో స్వామిని నియమ నిష్టలతో 11 సోమవారాలు మల్లెపూలతో కానీ, జాజిపూలతో కానీ అభిషేకిస్తే చర్మ వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం.